వారిద్దరి రాజీనామాలు.. కేటీఆర్ అభినందనలు

అత్యుత్తమంగా పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులను కుట్రపూరితంగా పక్కకు తప్పించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు కేటీఆర్.

Advertisement
Update:2024-06-01 10:49 IST

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ ప్రతీకార చర్యలు ఎక్కువయ్యాయనే ఆరోపణలు వినపడుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో కార్పొరేషన్ పదవులు పొందిన కొంతమందిని టార్గెట్ చేసి మరీ రాజీనామాలు చేయించారు. మరికొందరు కాంగ్రెస్ కి సరెండర్ అయిపోయి అవే పదవుల్లో కొనసాగుతున్నారు. ఇంకొందరు మాత్రం పదవుల్ని తృణప్రాయంగా వదిలేస్తున్నారు. అలాంటి వారికి అభినందనలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ బాటలో వారు నడుస్తున్నారని చెప్పారు.


తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమంటూ, అవసరమైనప్పుడు పదవులను గడ్డిపరకల్లా వదిలివేయడం కేసీఆర్ నేర్పారని. ఆయన బాటలో పదవులకు రాజీనామా చేసిన కొండూరి రవీందర్, గోంగిడి మహేందర్ రెడ్డి అభినందనీయులని తెలిపారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరి పదవులు కాపాడుకోవాలని వారిద్దర్నీ ప్రలోభ పెట్టారని, ఒత్తిడికి గురి చేశారని.. అయినా వారు కాంగ్రెస్ ప్రలోభాలకు లొంగలేదని చెప్పారు. నమ్మి నడిచిన బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ బాటకే జై కొట్టిన రవీందర్, మహేందర్ రెడ్డిని అభినందించారు కేటీఆర్.

అత్యుత్తమంగా పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులను కుట్రపూరితంగా పక్కకు తప్పించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు కేటీఆర్. రవీందర్, మహేందర్ రెడ్డి.. తమ పదవీకాలంలో రాష్ట్రంలో సహకార బ్యాంకులను అద్భుతంగా నడిపారని చెప్పారు. 10వేల కోట్ల రూపాయల రుణాలతో ఉన్న టెస్కాబ్ ను రూ. 42,000 కోట్ల సంస్థగా తీర్చిదిద్దారని, వినియోగదారుల సంఖ్యతో పాటు, డిపాజిట్లను మూడు రెట్లు పెంచి నమ్మకమైన సంస్థగా తయారు చేశారని ప్రశంసించారు. వారిద్దరి రాజీనామా రాష్ట్ర కోఆపరేటివ్ రంగానికి తీరని లోటు అన్నారు కేటీఆర్. 

Tags:    
Advertisement

Similar News