రజినీకాంత్, సన్నీడియోల్, లయ, గంగవ్వ.. పోలిక చెప్పిన కేటీఆర్
తెలంగాణ ఏర్పాటైనప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఏంటని చాలామందికి అనుమానాలుండేవని.. కానీ హైదరాబాద్ మహానగరం విశ్వనగరంగా ఎదిగే క్రమంలో ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్.
హైదరాబాద్ గురించి ఎవరెవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయనే విషయంలో విపక్షాలపై విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్నానా? హైదరాబాద్ లోనా..? అని రజినీకాంత్ అన్నారని గుర్తు చేశారు కేటీఆర్. బీజేపీ ఎంపీ సన్నీడియోల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారని చెప్పారు. తెలుగు సినిమా నటి లయ కూడా అమెరికాలో ఉండే నగరాలకంటే హైదరాబాదే బాగుందన్నారని తెలిపారు. సోషల్ మీడియా స్టార్ గంగవ్వ కూడా ఇటీవల దుబాయ్ వెళ్లొచ్చి.. హైదరాబాద్ లాగే ఉందని చెప్పిందని.. ఇంతమందికి హైదరాబాద్ గొప్పతనం అర్థమైతే.. అసలు కాంగ్రెస్, బీజేపీ వాళ్లకి ఎందుకు ఆ అభివృద్ధి కనపడటం లేదని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్.
అప్పుడే పుట్టిన పసిగుడ్డును చూసుకున్నట్టే తెలంగాణను కేసీఆర్ చూసుకుంటున్నారని చెప్పారు కేటీఆర్. హైదరాబాద్ నగరంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ వంటి కట్టడాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ఖైరతాబాద్, హిమాయత్ నగర్ కి చెందిన నాయకులను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారాయన. అభివృద్ధి అర్థమైనవారు బీఆర్ఎస్ తో కలసి నడుస్తున్నారని, వారందరికీ స్వాగతం అని చెప్పారు కేటీఆర్.
తెలంగాణ ఏర్పాటైనప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఏంటని చాలామందికి అనుమానాలుండేవని.. కానీ హైదరాబాద్ మహానగరం విశ్వనగరంగా ఎదిగే క్రమంలో ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్. కరెంట్ సమస్యను పరిష్కరించుకున్నామని, ప్రతి రోజూ, ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు వస్తున్నాయని, ఈ పదేళ్లలో కర్ఫ్యూలు లేవని, శాంతి భద్రతలను పటిష్టంగా కాపాడుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్ ను ప్రపంచంలోనే ఒక మంచి నగరంగా తీర్చిదిద్దుకుంటున్నామన్నారు. ఈ క్రమంలో ఎన్నో కొత్త వసతులు, కార్యక్రమాలు చేసుకుంటున్నామని తెలిపారు కేటీఆర్.