మహారాష్ట్ర రాజకీయ పార్టీ బీఆర్ఎస్ లో విలీనం
క్రాంతికారి షేత్కారి పార్టీకి మహారాష్ట్రలోని రైతాంగంలో మంచి పేరుంది. బీఆర్ఎస్ విధానాలకు ఆకర్షితులైన క్రాంతికారి షేత్కారి అధినేత సతీష్ సాల్వే.. కేసీఆర్ సారథ్యంలో పనిచేసేందుకు ముందుకొచ్చారు. తన పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేశారు.
మహారాష్ట్రకు చెందిన వివిధ పార్టీల నాయకులు ఇప్పటి వరకూ బీఆర్ఎస్ లో చేరారు. బీజేపీ, కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీలకు చెందిన నేతలు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఓ రాజకీయ పార్టీ బీఆర్ఎస్ లో విలీనం కావడం విశేషం. తెలంగాణ మోడల్ మహారాష్ట్రకు రావాలని కోరుకుంటూ క్రాంతికారి షేత్కారి పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేశారు ఆ పార్టీ అధినేత సతీష్ సాల్వే. తమ పార్టీ ముఖ్యనాయకులతో కలసి ఆయన సీఎం కేసీఆర్ ని కలిశారు. బీఆర్ఎస్ ని మహారాష్ట్రలో మరింత విస్తరిస్తామని తెలిపారు.
క్రాంతికారి షేత్కారి పార్టీకి మహారాష్ట్రలోని రైతాంగంలో మంచి పేరుంది. ఆ పార్టీ అధ్యక్షుడు సతీష్ సాల్వే.. రైతు రాజ్యం కోసం రాజకీయ పోరాటం చేస్తున్నారు. రైతులు, రైతు కూలీల మద్దతుతో రాజకీయం చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ కూడా 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' అనే నినాదంతో ముందుకొస్తోంది. బీఆర్ఎస్ విధానాలకు ఆకర్షితులైన క్రాంతికారి షేత్కారి అధినేత సతీష్ సాల్వే.. కేసీఆర్ సారథ్యంలో పనిచేసేందుకు ముందుకొచ్చారు. తన పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేశారు.
మరిన్ని చేరికలు..
స్వాతంత్ర దినోత్సవం రోజున.. బీఆర్ఎస్ లో మరిన్ని చేరికలు ఆసక్తికరంగా మారాయి. సతీష్ సాల్వే ఏకంగా తన పార్టీనే విలీనం చేయగా.. చరణ్ జీ వాఘ్మరే అనే కీలక నేత ఆధ్వర్యంలో బీజెపీ, కాంగ్రెస్, శివసేనతోపాటు పలు ఇతర పార్టీల నాయకులు బీఆర్‌ఎస్ లో చేరారు. నాగ్‌పూర్ జిల్లా ఉమ్రేడ్ తాలూకా నేతలు కూడా గులాబి కండువా కప్పుకున్నారు. మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఉన్నత విద్యావంతులు బీఆర్ఎస్ విధానాలు నచ్చి గులాబిదళంలో కలిసేందుకు వస్తున్నారు.