కాంగ్రెస్ లో కమిటీల కల్లోలం.. అలిగిన కొండా సురేఖ

తనకంటే జూనియర్లను, కనీసం ఎమ్మెల్యేలుగా గెలవని వారిని పొలిటికల్ అఫైర్స్ కమిటీలోకి తీసుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు కొండా సురేఖ.

Advertisement
Update:2022-12-11 18:24 IST

తెలంగాణ కాంగ్రెస్ లో కమిటీల కల్లోలం మొదలైంది. ఓ వ్యూహం ప్రకారమే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు కమిటీలలో లేకుండా చేశారు. దీంతో ఆయన అధిష్టానంపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవినే వదిలేసుకున్న తనకు పార్టీ పదవులు ఓ లెక్కా అన్నారు. ఆ తర్వాత కొంతసేపటికి మాజీ మంత్రి కొండా సురేఖ తన అసంతృప్తి బయటపెట్టారు. ఆమెను ఎగ్జిక్యూటివ్ కమిటీలోకి తీసుకున్నారు. కానీ ఆమె పొలిటికల్ అఫైర్స్ కమిటీలో స్థానం ఇవ్వలేదని ఆమె అలిగారు.

ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా..

తనకంటే జూనియర్లను, కనీసం ఎమ్మెల్యేలుగా గెలవని వారిని పొలిటికల్ అఫైర్స్ కమిటీలోకి తీసుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు కొండా సురేఖ. నాలుగుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిగా పనిచేసిన తనకు అవకాశం ఇవ్వకపోవడం దారుణం అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఆమె బహిరంగ లేఖ రాశారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానన్నారు. తనతోపాటు వరంగల్ జిల్లాకు చెందిన ఏ ఒక్కరికీ కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో స్థానం లేకుండా చేయడం సరికాదన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదు, ఆత్మాభిమానం ముఖ్యం అన్నారు సురేఖ. రేవంత్ రెడ్డికి తమ మద్దతు ఉంటుందని, పార్టీలో సామాన్య కార్యకర్తలా కొనసాగుతానన్నారు సురేఖ.

పక్క పార్టీలనుంచి వస్తే నెత్తిన పెట్టుకుంటారా..?

తెలంగాణ కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వడంలేదని, పక్క పార్టీలనుంచి వచ్చినవారిని నెత్తిన పెట్టుకుంటున్నారని విమర్శించారు సురేఖ. రాజకీయ బతుకుదెరువుకోసం మూట ముల్లె సర్దుకుని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కమిటీల్లో ప్రముఖ స్థానం ఇచ్చారని ఆరోపించారు. తనతోపాటు తన భర్త కొండా మురళి వరంగల్ ఈస్ట్, పరకాల నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు సురేఖ. ఈమేరకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆమె లేఖ రాశారు. ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు.

Tags:    
Advertisement

Similar News