తప్పు చేశావ్ షర్మిల.. లైవ్‌లో రాజీనామా ప్రకటించిన కీలక నేత
చనిపోయాడన్న కారణంతో బోఫోర్స్ కుంభకోణం నుంచి రాజీవ్ గాంధీ పేరును తొలగించారని, ఇక్కడ మాత్రం చనిపోయిన తర్వాత తమ దేవుడు వైఎస్ పేరును కాంగ్రెస్ పార్టీ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిందన్నారు.
సోనియా గాంధీతో వైఎస్ షర్మిల భేటీని వైఎస్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ టీపీలో దుమారం రేగింది. తొలి నుంచి ఆమెతో పాటు ఉన్న కొండా రాఘవరెడ్డి ఏకంగా షర్మిల తీరుకు వ్యతిరేకంగా ఒక టీవీ చర్చాకార్యక్రమంలోనే రాజీనామా ప్రకటించారు.
షర్మిల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల.. వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలిసినా, కొన్ని ఛానళ్లకు వెళ్లి జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడినా, సీబీఐ పిలవకున్నా ఢిల్లీ వెళ్లి రాజకీయ కుట్రలో భాగంగానే వివేకానందరెడ్డిని చంపేశారని చెప్పినా, తెలంగాణ పోలీసులపై చేయి చేసుకున్నా.. తమ నాయకుడు వైఎస్‌ఆర్ కుమార్తె అని భరిస్తూ వచ్చామని, సోనియా ఇంటి గడపను షర్మిల తొక్కడాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నామన్నారు.
చనిపోయాడన్న కారణంతో బోఫోర్స్ కుంభకోణం నుంచి రాజీవ్ గాంధీ పేరును తొలగించారని, ఇక్కడ మాత్రం చనిపోయిన తర్వాత తమ దేవుడు వైఎస్ పేరును కాంగ్రెస్ పార్టీ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిందన్నారు. అలా కుటుంబాన్నే రోడ్డుకు ఈడ్చిన వారి గడపను షర్మిల తొక్కడాన్ని తాము జీర్ణించుకోలేపోతున్నామని, ఇందుకు నిరసనగా తాను వైఎస్‌ఆర్టీపీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్టు చర్చలోనే కొండా రాఘవరెడ్డి ప్రకటించారు.
కుటుంబాన్ని ఫుట్‌పాత్ మీదకు లాగిన పార్టీతో ఎలా కలుస్తారని ఆయన ప్రశ్నించారు. తనకు వైఎస్‌ఆర్ దేవుడని మునుముందు కూడా తాను వైఎస్‌ఆర్ కుటుంబంతోనే ఉంటానని చెప్పారు. షర్మిలతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పేశారు.
*