పాపం అన్న కూడా ఏమీ చేయలేకపోతున్నాడా?

మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో గెలుపున‌కు తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి నానా అవస్థ‌లు పడుతుంటే.. అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమీ చేయలేకపోతున్నారా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూసిన తర్వాత అందరిలోనూ ఇదే అనుమానం క‌లుగుతోంది.

Advertisement
Update:2022-10-15 11:50 IST

మాంత్రికుడి ప్రాణం చిలుకలో ఉన్నట్లు.. తమ్ముడి బలమంతా అన్నే. అలాంటిది ఇప్పుడు మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో గెలుపున‌కు తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి నానా అవస్థ‌లు పడుతుంటే.. అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమీ చేయలేకపోతున్నారా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూసిన తర్వాత అందరిలోనూ ఇదే అనుమానం క‌లుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా రాజీనామా చేసే ముందు కోమటిరెడ్డి బ్రదర్స్ అంతా వివరంగా మాట్లాడుకున్నారు.

కాంగ్రెస్‌కు రాజీనామా చేయటమే ఆలస్యం తన మద్దతుదారులంతా తనతో పాటు బీజేపీలో చేరిపోతారని రాజగోపాలరెడ్డి అనుకున్నారు. అయితే రాజగోపాల్‌తో పాటు కొద్ది మంది మాత్రమే బీజేపీలో చేరారు. మిగిలిన వాళ్ళల్లో అత్యధికులు కాంగ్రెస్‌లోనే కంటిన్యు అవుతున్నారు. చాలా కొద్దిమంది మాత్రం టీఆర్ఎస్‌లో చేరారు. ఈ విషయం గమనించిన తర్వాత తమ వ్యూహానికి విరుద్ధంగా జరుగుతోందని అన్న వెంకటరెడ్డికి అర్ధమైపోయింది.

అందుకనే తమ మద్దతుదారులతో మీటింగ్ పెట్టుకుని బీజేపీలోకి వెళ్ళిన‌ తమ్ముడికి మద్దతుగా నిలబడమని బాగా ఒత్తిడిచేశారు. అయితే బీజేపీలోకి వెళ్ళటానికి ఎదురుతిరిగిన మద్దతుదారులు తమను ఎంపీ ఒత్తిడి చేస్తున్న విషయాన్ని మీడియాలోనే చెప్పేశారు. దాంతో ఏమి చేయాలో అర్ధంకానీ ఎంపీ మళ్ళీ మద్దతుదారులతో మాట్లాడలేదు. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే తాను కాంగ్రెస్ ఎంపీగానే ఉంటూ తమ్ముడి గెలుపున‌కు ఏ విధంగా సహకరించాలో అర్ధమవుతున్నట్లు లేదు.

ఇదే సమయంలో రాజగోపాల్‌కు బీజేపీ రాష్ట్ర స్ధాయి నేతల నుండి పెద్దగా మద్దతు దొరకటం లేదు. అలాగే నియోజకవర్గంలోని కమలం నేతల్లో చాలా మంది దూరంగా ఉంటున్నారు. రాజగోపాల్‌తో వచ్చిన మద్దతుదారులకు, మొదటి నుండి పార్టీలో ఉన్న నేతలకు మధ్య ఆధిపత్య గొడవలు జరుగుతున్నాయి. ఇవన్నీ సరిపోవన్నట్లు కొన్నిగ్రామాల్లో రాజగోపాల్‌ను ప్రచారం చేసుకోవటానికే రానీయటం లేదు.

కారణం ఏమిటంటే 2018 ఎన్నికల్లో సొంత డబ్బులు ఖర్చుపెట్టయినా సరే డెవలప్ చేస్తానని హామీ ఇచ్చారట. గెలిచిన తర్వాత మళ్ళీ గ్రామాల వైపు చూస్తే ఒట్టు. అందుకనే ఇప్పుడు అవసరం కోసం వస్తున్న రాజగోపాల్‌ను కొన్ని గ్రామాల్లో అడ్డుకుంటున్నారు. సో జరుగుతున్నది చూసిన తర్వాత తమ్ముడిని ఎలా ఆదుకోవాలో? గెలిపించాలో? అన్న వెంకటరెడ్డికి కూడా ఏమీ అర్ధమవుతున్నట్లు లేదు పాపం.

Tags:    
Advertisement

Similar News