హోం శాఖ నాదే.. నాకోసం ఆ పని చేయండి

తనకు ఏదైనా కావాలి అంటే అడిగి తీసుకోనని, లాక్కుంటానని అంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తనకు కావాల్సింది దక్కాలంటే, భువనగిరిలో చామలను భారీ మెజార్టీతో గెలిపించాలని అనుచరులకు సూచించారు.

Advertisement
Update:2024-04-18 14:40 IST

తెలంగాణలో రేవంత్ రెడ్డి తొలి టీమ్ లో ప్రత్యేకంగా హోం శాఖను ఎవరికీ కేటాయించలేదు. సీఎం రేవంత్ రెడ్డి అదనంగా ఆ శాఖను కూడా పర్యవేక్షిస్తున్నారు. అయితే లోక్ సభ ఎన్నికల వేళ హోం శాఖ తీవ్ర చర్చనీయాంశమవుతోంది. విస్తరణలో ఆ శాఖ తనకు కావాలని ఆశిస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆల్రడీ ఆయన సోదరుడు వెంకట్ రెడ్డి.. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉండటంతో రాజగోపాల్ రెడ్డిక్ అవకాశం అంత ఈజీగా దొరుకుతుందా అనే అనుమానాలున్నాయి. అయితే ఆయన మాత్రం తనకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని, అది కూడా హోం శాఖే ఇచ్చి తీరాలని అంటున్నారు.


ఇటీవల తన కోర్ టీమ్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి భువనగిరి ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇప్పించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆయన గెలుపు బాధ్యతలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అప్పగించారు. ఆయన్నే ఆ నియోజకవర్గ ఇన్ చార్జ్ గా నియమించారు. అంతే కాదు, చామలను గెలిపించుకుని వస్తే బంపర్ ఆఫర్ ఇస్తానని కూడా నమ్మకంగా చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా అదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

తనకు ఏదైనా కావాలి అంటే అడిగి తీసుకోనని, లాక్కుంటానని అంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తనకు కావాల్సింది దక్కాలంటే, భువనగిరిలో చామలను భారీ మెజార్టీతో గెలిపించాలని అనుచరులకు సూచించారు. అప్పుడు తాను కూడా మంత్రిని కావొచ్చని చెప్పారు. తాను హోంమంత్రి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని కూడా సెలవిచ్చారాయన. తాను హోంమంత్రి అయితే బీఆర్ఎస్‌ నేతలను జైలుకు పంపిస్తానన్నారు. అందుకే తాను హోంమంత్రి కాకూడదని బీఆర్ఎస్‌ నేతలు కోరుకుంటున్నారని తెలిపారు. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన మనసులో మాట బయటపెట్టారు. లోక్ సభ ఎన్నికల్లో తాను ఇన్ చార్జ్ గా ఉన్న భువనగిరి స్థానంలో కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ ఇప్పించాలని కోరారు. అలా చేస్తే తనకు మినిస్టర్ పోస్ట్ గ్యారెంటీ అంటున్నారు రాజగోపాల్ రెడ్డి.

Tags:    
Advertisement

Similar News