గాంధీభవన్ కు వచ్చిన కోమటి రెడ్డి... చేతులు కలిపిన రేవంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి

మీడియాతో మాట్లాడిన కోమటి రెడ్డి గాంధీభవన్ మెట్లు ఎక్కబోనని తానెప్పుడూ అనలేదని అన్నారు. గాంధీభవన్ తో తనకు 30 ఏళ్ళ అనుబంధం ఉందని, గాంధీ భవన్ తన జీవితమన్నారు.

Advertisement
Update:2023-01-20 19:26 IST


కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, గాంధీభవన్ మెట్లు ఎక్కబోనన్న వెంకట్ రెడ్డి గాంధీభవన్ కు వచ్చారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు.ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరూ ఒకరి చేతిలో మరొకరు చేయి వేసుకొని మరీ మాట్లాడుకున్నారు.

ఆ తర్వాత వెంకట్ రెడ్డి ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే తో సమావేశమయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన 'హాత్ పే హాత్ జోడో' కార్యక్రమం పై చర్చించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కోమటి రెడ్డి గాంధీభవన్ మెట్లు ఎక్కబోనని తానెప్పుడూ అనలేదని అన్నారు. గాంధీభవన్ తో తనకు 30 ఏళ్ళ అనుబంధం ఉందని, గాంధీ భవన్ తన జీవితమన్నారు. మీటింగ్‌కు రావాలని ఠాక్రే ఆహ్వానించారని తెలిపారు. ఎలక్షన్ కమిటీ మీటింగ్‌లో పాల్గొనడానికి వచ్చానని పేర్కొన్నారు. తాను ప్రతిరోజు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని వెంకటరెడ్డి తెలిపారు. 26వ తేదీ నుంచి జరగబోయే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని అన్నారు.

కాగా రేవంత్ పీసీసీ అధ్యక్షుడుగా నియమించబడ్డప్పటి నుంచి వెంకట్ రెడ్డికి ఆయనకు ఉప్పు నిప్పుగా ఉంది. వెంకట్ రెడ్డి బహిరంగంగానే రేవంత్ పై విమర్శలు గుప్పించారు. మునుగోడు ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థి అయిన తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి గెలుపుకోసం వెంకట్ రెడ్డి కృషి చేశారని, కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడానికి పని చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. ఆ ఎన్నికల సమయం నుండి రేవంత్, వెంకట్ రెడ్డి మధ్య మరింత అగాధం ఏర్పడింది. అయితే చాలా కాలం తర్వాత ఇద్దరు నేతలు చాలా సేపు సమావేశమవడం, అన్యోన్యంగా ఉండటం అందరినీ ఆకర్షించింది. అయితే ఈ స్నేహం ఎంత కాలం కొనసాగుతుందనే ప్రశ్న కాంగ్రెస్ కార్యకర్తల మనసుల్లో మెదులుతూనే ఉంది.


Tags:    
Advertisement

Similar News