సీఎం రేవంత్ బెదిరిస్తున్నారు.. కేటీఆర్ వద్ద బాధితుల ఆవేదన

కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండల రైతులు ఈ రోజు తెలంగాణ భవన్ కు వచ్చి కేటీఆర్‌ని కలసి తమ కష్టాలు చెప్పుకున్నారు.

Advertisement
Update:2024-08-09 17:09 IST

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ కంపెనీల కోసం భూములు ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి, ఆయన అన్న తిరుపతి రెడ్డి.. తమను బెదిరిస్తున్నారని కొంతమంది రైతులు ఆరోపిస్తున్నారు. వారంతా ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలన్నారు, తమ పోరాటానికి అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు.


కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండల రైతులు ఈ రోజు తెలంగాణ భవన్ కు వచ్చి కేటీఆర్‌ని కలసి తమ కష్టాలు చెప్పుకున్నారు. దుద్యాల్ మండలంలోని హకీంపేట్, పోలేపల్లి, లకచర్ల గ్రామాల పరిధిలో 3 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. ప్రభుత్వమే తమని ఇబ్బంది పెడుతుంటే తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలని విలపించారు.

ఫార్మా కంపెనీలు వస్తే కాలుష్యం పెరుగుతుందని, తమకు ఈ ఫ్యాక్టరీలు వద్దని రైతులు చెబుతున్నారు. ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వడానికి తాము సిద్ధంగా లేమన్నారు. లక్షల కోట్ల రూపాయల విలువ చేసే భూములను ప్రభుత్వం తమ వద్ద నుంచి లాక్కునేందుకు కుట్ర చేస్తుందన్నారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు తెలంగాణ భవన్ కి వచ్చిన రైతులు కేటీఆర్‌ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. వ్యవసాయంపై ఆధారపడిన తమ కుటుంబాలకు ఆ భూమి దూరం కాకుండా చూడాలన్నారు. వారి కష్టాలు విన్న కేటీఆర్.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

Tags:    
Advertisement

Similar News