మోదీ మోసాన్ని గుర్తు చేసిన కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి ట్వీట్ కి నెటిజన్లు కౌంటర్లిస్తున్నారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాల సంగతి తేల్చాలని ప్రశ్నిస్తున్నారు.

Advertisement
Update:2024-02-02 17:24 IST

ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు..

ఈ అతి పెద్ద హామీ ఎవరిదో అందరికీ తెలుసు. యువత ఓట్లు కొల్లగొట్టడానికి మోదీ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన అతి పెద్ద అసత్యపు హామీ ఇది. 2 కోట్లు కాదు కదా, కనీసం ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు కూడా నికరంగా భర్తీ చేయలేదని ప్రతిపక్షాలు ఆధారాలతో సహా నిరూపిస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించి ఇప్పుడు నవ్వులపాలయ్యారు. ఫిబ్రవరి-1 వచ్చింది.. గ్రూప్-1 నోటిఫికేషనే ఏదీ..? అంటూ కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ క్రమంలో పరోక్షంగా మోదీ చేసిన మోసాన్ని మరోసారి ప్రజలకు గుర్తు చేశారాయన.


ప్రజలను మభ్య పెట్టడంలో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ మరోసారి తెలంగాణ యువతను మోసం చేసిందని మండిపడ్డారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి. ఫిబ్రవరి 1న గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ వాగ్దానం చేసిందని, ఇప్పుడా సమయం దాటిపోయిందని గుర్తు చేశారు.

ఈరోజు ఫిబ్రవరి-2

ఈరోజు ఫిబ్రవరి-2 అంటూ తేదీని గుర్తు చేస్తూ కిషన్ రెడ్డి ట్విట్టర్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు. క్యాలెండర్ లో తేదీ మారేలోపు నోటిఫికేషన్ వస్తుందేమోనని ఎదురు చూశామని, కానీ 2వతేదీ వచ్చినా కూడా తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ రాలేదని ఆయన సెటైర్ పేల్చారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి వాటిని అమలు చేసే ఉద్దేశం లేదన్నారు. అయితే కిషన్ రెడ్డి ట్వీట్ కి నెటిజన్లు ఫుల్లుగా కౌంటర్లిస్తున్నారు. తెలంగాణ గ్రూప్-1 సంగతి తర్వాత కానీ.. ముందు ఏడాదికి 2కోట్ల ఉద్యోగాల సంగతి తేల్చాలని ప్రశ్నిస్తున్నారు. అబద్ధాలాడటంలో బీజేపీ తర్వాతే ఎవరైనా అని బదులిస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ ని వెటకారం చేయబోయి.. మోదీ అసత్య హామీని మరోసారి హైలైట్ అయ్యేలా చేసి ఇరుకున పడ్డారు కిషన్ రెడ్డి.

Tags:    
Advertisement

Similar News