పోలీసు అధికారులు దిగజారి వ్యవహరిస్తున్నారు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఫామ్ హౌస్‌లో డబ్బు దొరికిందని చెబుతున్నారు. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలను ఎందుకు బయటపెట్టడం లేదని మంత్రి ప్రశ్నించారు.

Advertisement
Update:2022-10-27 13:55 IST

తెలంగాణ పోలీసు అధికారులు దిగజారి ప్రవర్తిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మునుగోడులో ఓటమి ఖాయమని గ్రహించే టీఆర్ఎస్ ఇలా ఎమ్మెల్యేల కొనుగోలు అనే కొత్త నాటకానికి తెర తీసిందని ఆయన ఆరోపించారు. బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ వందల కోట్ల రూపాయలు ఇవ్వడానికి అనవసరమైన ఆరోపణలు చేశారన్నారు. డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఆశ చూపించిందంటూ ప్రజల ముందు డ్రామాలాడారని మండిపడ్డారు. ప్రధాని మోడీ దిష్టి బొమ్మలను కూడా మంత్రులే తగులబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫామ్ హౌస్‌లో డబ్బు దొరికిందని చెబుతున్నారు. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలను ఎందుకు బయటపెట్టడం లేదని మంత్రి ప్రశ్నించారు. దొరికిన డబ్బు ఎమ్మెల్యేల నుంచే వచ్చిందా? లేదంటే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. గతంలో పార్టీ ఫిరాయించిన వారికి టీఆర్ఎస్ పార్టీనే పెద్ద పీట వేసిందని ఆయన గుర్తు చేశారు. అనేక మంది ఎమ్మెల్యేలను, ఎంపీలను చేర్చుకున్నది టీఆర్ఎస్ పార్టీనే అని చెప్పారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఏ ప్రాతిపదికన పార్టీలో చేర్చుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

మునుగోడులో ఓటమి చెందుతామనే భయం టీఆర్ఎస్‌కు పట్టుకుందన్నారు. గతంలో దుబ్బాక ఉపఎన్నిక సమయంలో కూడా ఇలాంటి నాటకాలే ఆడారని అన్నారు. టీఆర్ఎస్ ఇప్పుడు నీతి మాటలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి అన్నారు. వేలాది మంది బీజేపీ కార్యకర్తలకు తాయిలాలు చూపించి టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. నలుగురు ఎమ్మెల్యేల వల్ల మాకు ఒరిగేది ఏమీ లేదు. ఫామ్‌హౌస్‌లో పట్టుబడిన వ్యక్తులు బీజేపీ వారిగా ముద్ర వేస్తున్నారు. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్‌కు చిత్త శుద్ది ఉంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

రాజకీయ పార్టీలు మాడం పెద్ద నేరం కాదు. ఎవరైనా పార్టీలు మారవచ్చు. అయితే టీఆర్ఎస్ నాయకులు బీజేపీకి అవసరం లేదు. పోలీసులు రాకముందే టీఆర్ఎస్ సోషల్ మీడియా గ్రాఫిక్స్ తయారు చేసి పెట్టుకుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎవరైనా సరే మధ్యవర్తుల అవసరం లేకుండానే మా పార్టీలోకి రావొచ్చని కిషన్ రెడ్డి అన్నారు.

Tags:    
Advertisement

Similar News