తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. కుల వృత్తులు చేసే వారికి రూ.1 లక్ష ఆర్థిక సాయం
కులవృత్తి చేసుకునే వారికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించేలా కార్యచరణ రూపకల్పన చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది.
కుల వృత్తులను బలోపేతం చేసేందుకు, వారికి ఆర్థికంగా చేయూత అందించేందుకు విధివిధానాలు రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు గాను మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన తొలి సారిగి నూతన సచివాయంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన విషయాలు ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మీడియాకు వెల్లడించారు.
కులవృత్తి చేసుకునే వారికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించేలా కార్యచరణ రూపకల్పన చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. విశ్వ బ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణులు, మేదరి, కుమ్మరి, కల్లుగీత కార్మికులు తదితర కుల వృత్తుల వారికి ప్రోత్సాహం అందించాలని నిర్ణయించారు.
హైదరాబాద్ నగర శివారులోని హిమాయత్ సాగర్, గండిపేట చెరువులను కాళేశ్వరం జలాలతో అనుసంధానం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. గండిపేట, హిమాయత్ సాగర్‌లను నిండుకుండలా మార్చడంతో పాటు మూసీని స్వచ్ఛంగా మార్చడంలో ఈ అనుసంధానం కీలకంగా ఉంటుందని కేసీఆర్ అన్నారు. హుస్సేన్ సాగర్‌ను కూడా గోదావరి జలాలతో అనుసంధానించనున్నారు. ఇందుకు అవసరమైన డిజైన రూపకల్పన చేయాలని సంబంధిత శాఖ మంత్రిని ఆదేశించారు.
జీవో 111ను పూర్తిగా ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఈ జీవో పరిధిలో ఉన్న 84 గ్రామాల ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉన్నామంటూ.. ఎన్నో ఏళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ ఈ మేరకు కేబినెట్‌లో చర్చించారు. ఆయా గ్రామాల ప్రజలకు మేలు చేసే విధంగా జీవోను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామాలకు ఏయే విధివిధానాలు అమలులో ఉన్నాయో.. వాటినే ఈ 84 గ్రామాలకు వర్తింప చేయాలని నిర్ణయించారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు డీఎం అండ్ హెచ్‌వో పోస్టులను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ జిల్లాలో జనాభా పరంగా పెద్దగా ఉండటమే కాకుండా.. రాష్ట్ర రాజధానిగా ఉండటం వల్ల.. ఇక్కడ ఆరు డీఎం అండ్ హెచ్‌వో పోస్టులను మంజూరు చేయనున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 38 మంది డీఎం అండ్ హెచ్‌వోలు ఉండనున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 40 మండలాలకు పీహెచ్‌సీలను మంజూరు చేశారు. అలాగే అర్భన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో శాశ్వత ఉద్యోగుల నియామకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
వ్యవసాయ రంగంలో పలు మార్పులు తెచ్చేందుకుగాను ఆ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది. యాసంగి పంటను ఇకపై నెల రోజుల ముందుగా వేసే అంశాన్ని సబ్ కమిటీ అధ్యయనం చేయనున్నది. నకిలీ విత్తనాలకు సంబంధించి ఉక్కుపాదం మోపాలని, ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే పీడీ యాక్ట్ పెట్టాలని కేబినెట్ ఆదేశించింది. మక్కలు కొనేందుకు కూడా నిర్ణయించారు.
వీఆర్ఏలను క్రమబద్దీకరించి వారిని వివిధ విభాగాల్లో సర్థుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందుకు సంబంధించి వీఆర్ఏ సంఘాలు, ఆయా శాఖల అధికారులతో చర్చలు జరపాలని పీసీఎల్ఏకు కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది.
వనపర్తి జర్నలిస్టు భవన్ కోసం 10 గుంటలు.. ఖమ్మం జిల్లాలో జర్నలిస్టు భవన్, ఇళ్ల స్థలాల కోసం 23 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. మైనార్టీ కమిషన్‌లో జైనుల ప్రతినిధిని కూడా చేర్చాలనే నిర్ణయాన్ని ఆమోదించారు. టీఎస్‌పీఎస్సీలో కొత్తగా 10 పోస్టులకు మంజూరు చేశారు.