తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం.. ఇకపై గవర్నమెంట్ స్కూల్స్‌లో బ్రేక్ ఫాస్ట్

స్కూల్‌లో ఉదయం పిరియడ్లు ముగిసిన తర్వాత ఇచ్చే ఇంటర్వెల్ సమయంలో విద్యార్థులకు బెల్లం, రాగి పిండి కలిపిన జావను బ్రేక్ ఫాస్ట్ లాగా ఇవ్వనున్నారు.

Advertisement
Update:2023-05-14 13:52 IST

తెలంగాణలోని ప్రభుత్వ స్కూల్స్‌లో చదివే విద్యార్థులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. గవర్నమెంట్ స్కూల్స్‌లో చదివే చాలా మంది పిల్లలు రక్తహీనత, పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. చాలా మంది విద్యార్థులు పేద కుటుంబాలకు చెందిన వారు. దీంతో ఉదయాన్నే ఏమీ తినకుండానే పాఠశాలకు వస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న లంచ్ సమయం వరకు ఖాళీ కడుపుతోనే ఉంటున్నారు. ఇది విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో ఇకపై ఉదయం పూట విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ కూడా అందించాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది.

స్కూల్‌లో ఉదయం పిరియడ్లు ముగిసిన తర్వాత ఇచ్చే ఇంటర్వెల్ సమయంలో విద్యార్థులకు బెల్లం, రాగి పిండి కలిపిన జావను బ్రేక్ ఫాస్ట్ లాగా ఇవ్వనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య సమయంలో విద్యార్థులకు రాగి జావ అందించనున్నారు. మధ్యాహ్న భోజనం పథకం‌లో భాగంగా భోజనం వండే కుక్ కమ్ హెల్పర్లే.. ఉదయం పూట ఈ జావను తయారు చేస్తారని విద్యా శాఖ వెల్లడించింది. ఇందుకు అవసరం అయ్యే రాగి పిండి, బెల్లం పౌడర్‌ను బడులకు ప్రభుత్వం సరఫరా చేయనున్నది.

ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకంలో ఒక రోజు వెజిటెబుల్ బిర్యానీ అందిస్తున్నారు. దీని వల్ల పిల్లలకు పోషకాలు అందుతున్నాయి. రాగి మాల్ట్ వల్ల విద్యార్థుల్లో రక్త హీనత, ఐరన్ లోపాన్ని అరికట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ 2023-24 విద్యా సంవత్సరం నుంచే బ్రేక్ ఫాస్ట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని సర్కారు బడుల్లో స్వచ్ఛంద సంస్థలు, ట్రస్ట్‌ల సహకారంతో రాగి జావ అందిస్తున్నారు. ఆయా పాఠశాల్లలో విద్యార్థుల ఆరోగ్యం మెరుగైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ బడుల్లో రాగిజావ అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News