డిసెంబర్ 9న ఢిల్లీలో కేసీఆర్ జాతీయ పార్టీ సభ.!

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ దీక్షలో ఉన్నప్పుడు నాటి హోం మంత్రి చిదంబరం డిసెంబర్ 9న ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేశారు. ఆ రోజు తెలంగాణ ప్రజలకే కాకుండా.. కేసీఆర్ చేసిన ఉద్యమానికి కూడా ఒక విజయోత్సవం లాంటిది. అందుకే అదే డిసెంబర్ 9న ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement
Update:2022-10-02 18:30 IST

టీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లే కసరత్తులో సీఎం కేసీఆర్ తలమునకలై ఉన్నారు. ఇప్పటికే దసరా రోజున‌ జాతీయ పార్టీని కేసీఆర్ ప్రకటిస్తారనే విషయాలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. దీనికి సంబంధించి కేసీఆర్ ప్రభుత్వంలో కీలకమైన మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు టీఆర్ఎస్ పార్టీ బాధ్యులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ప్రగతి భవన్‌లో మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు. గతంలో ప్రచారం జరిగినట్లుగానే దసరా రోజు మధ్యాహ్నం 1.19కి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేయడం ఖరారయ్యింది. ఇవ్వాళ్టి సమావేశంలో అందరి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న కేసీఆర్.. ఎట్టకేలకు పార్టీ ప్రకటనపై తుది నిర్ణయానికి వచ్చారు.

కాగా, పార్టీ ప్రకటన చేయడానికి ముందు తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కార్యవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించనున్నారు. టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చడానికి ఆ సమావేశంలో తీర్మానం చేయనున్నారు. పార్టీని కేవలం తెలంగాణకు పరిమితం చేయకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించాలనే తీర్మానం ఆమోదించన వెంటనే.. మధ్యాహ్నం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారు. జాతీయ స్థాయిలోకి టీఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి నిర్ణయం తీసుకున్నందున.. పార్టీ పేరు కూడా మారుస్తున్నట్లు కేసీఆర్ మీడియా ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే జాతీయ పార్టీ పేరు, జెండా, అజెండా విషయాలు చర్చించారు. ఈ రోజు తీసుకున్న నిర్ణయాలనే దసరా రోజు జరిగే సమావేశంలో ప్రవేశపెట్టి తీర్మానం చేయనున్నారు.

జాతీయ పార్టీని ప్రకటించిన తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు గురించి ప్రచారానికి కరీంనగర్ సభను వాడుకునే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా జాతీయ పార్టీ తొలి బహిరంగ సభను డిసెంబర్ 9న ఢిల్లీలో నిర్వహించనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ దీక్షలో ఉన్నప్పుడు అప్పటి హోం మంత్రి చిదంబరం డిసెంబర్ 9న ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేశారు. ఆ రోజు తెలంగాణ ప్రజలకే కాకుండా.. కేసీఆర్ చేసిన ఉద్యమానికి కూడా ఒక విజయోత్సవం లాంటిది. అందుకే అదే డిసెంబర్ 9న ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ఢిల్లీలో బహిరంగ నిర్వహించే రోజునే.. తెలంగాణలో పార్టీ పరంగా భారీ కార్యక్రమాలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు.


Tags:    
Advertisement

Similar News