కేసీఆర్ కీలక నిర్ణయం.. ఉప్పల్ రోడ్డును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని వెల్లడి
ఉప్పల్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ పనుల కారణంగా తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.
ఉప్పల్ నుంచి నారపల్లి వరకు కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ వల్ల రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్నాళ్లుగా ఆ ప్రాంత ప్రజలు రోడ్ల మరమ్మతు గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా పాడైన రోడ్లపై వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అనేక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.
హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రయాణించేలా ఎన్‌హెచ్ 163ను కేంద్ర ప్రభుత్వం అప్ గ్రేడ్ చేయాలని ఎప్పుడో నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ వరకు ఎక్స్‌ప్రెస్ వేను గత ప్రభుత్వమే నిర్మించింది. అయితే ఎంజీబీఎస్ నుంచి ఛే నెంబర్, రామాంతాపూర్, ఉప్పల్ చౌరస్తా మీదుగా నారపల్లి వరకు ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని నిర్ణయించారు. అయితే ఉప్పల్ నుంచి నారపల్లి వరకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే నేషనల్ హైవే అథారిటీస్ ఈ పనులను గత కొన్నేళ్లుగా నత్త నడకన సాగిస్తోంది.
ఉప్పల్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ పనుల కారణంగా తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా యాదగిరి గుట్ట, వరంగల్ వెళ్లే బస్సులతో పాటు.. బోడుప్పల్, నారపల్లి వైపు వెళ్లే ద్విచక్రవాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో ఈ సమస్య మరింత జఠిలంగా మారింది. గతంలో ఈ రహదారి పరిస్థితి, ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే పనులకు సంబంధించి మంత్రి కేటీఆర్ కూడా కేంద్ర ప్రభుత్వానికి ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కారణంగానే ఈ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయని కేటీఆర్ అప్పుడే వెల్లడించారు.
ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఈ రహదారి పనులను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని నిర్ణయించారు. ఉప్పల్ ప్రాంతవాసుల పరిస్థితిని మంత్రి మల్లారెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొని వెళ్లారు. ఆ వినతిని పరిశీలించిన కేసీఆర్.. వెంటనే ఉప్పల్-నారపల్లి రహదారిని బాగుచేయాలని నిర్ణయించారు. ఎలివేటెడ్ హైవే కోసం నిర్మించిన పిల్లర్లకు ఇరువైపులా బీటీ రోడ్డును వేయాలని ఆర్‌అండ్‌బీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఆదేశించారు. వర్షాకాలం పూర్తయిన వెంటనే ఈ రహదారిని వాహనదారులకు అనుకూలంగా మార్చాలని కేసీఆర్ చెప్పారు.
ఈ రహదారిని బాగు చేయడం ద్వారా ఉప్పల్ చౌరస్తా నుంచి వరంగల్ వైపు వెళ్లే ద్విచక్ర వాహనదారులకు మేలు కలుగుతుంది. అలాగే వరంగల్ వైపు వెళ్లే బస్సులు, కార్లు వేగంగా గమ్యస్థానం చేరుకునే వీలుంది.