వంద నియోజకవర్గాలు.. వంద సభలు.. కేసీఆర్ మాస్టర్‌ ప్లాన్‌..!

ఉత్తర తెలంగాణ జిల్లాల బాధ్యతలను కేటీఆర్, దక్షిణ తెలంగాణ జిల్లాల ఇన్‌ఛార్జిగా హరీష్‌ రావు వ్యవహరించనున్నారు. దీంతో పాటు GHMC, HMDA పరిధిలో కూడా మంత్రి కేటీఆర్ ప్రచార బాధ్యతలు తీసుకోనున్నారు.

Advertisement
Update:2023-09-24 11:10 IST

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇప్పటికే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదున్న కేసీఆర్.. త్వరలోనే ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అక్టోబర్‌, నవంబర్‌లో వంద నియోజకవర్గాలను సుడిగాలి వేగంతో చుట్టేయనున్నారు గులాబీ బాస్‌.

ఎలక్షన్ కమిషన్ ఆఫ్‌ ఇండియా అక్టోబర్‌ ఫస్ట్ వీక్‌లో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసి డిసెంబర్‌ ఫస్ట్ వీక్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండటంతో.. పార్టీ ఎన్నికల వ్యూహ కమిటీ కేసీఆర్‌ బహిరంగ సభల షెడ్యూల్‌ను ఫైనల్ చేస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల బాధ్యతలను కేటీఆర్, దక్షిణ తెలంగాణ జిల్లాల ఇన్‌ఛార్జిగా హరీష్‌ రావు వ్యవహరించనున్నారు. దీంతో పాటు GHMC, HMDA పరిధిలో కూడా మంత్రి కేటీఆర్ ప్రచార బాధ్యతలు తీసుకోనున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మెదక్‌, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలపై మంత్రి హరీష్‌ రావు ఫోకస్ పెడతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఆగస్టు 20న సూర్యాపేటలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ఫస్ట్ ఫేజ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా సెప్టెంబర్‌ 16 కొల్లాపూర్‌లో నిర్వహించిన సభలోనూ కేసీఆర్ పాల్గొన్నారు.

ఇక మరోవైపు మేనిఫెస్టో కమిటీ సైతం ప్రణాళిక తయారీలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. మేనిఫెస్టోలో పేదలు, మహిళలకు పెద్దపీట వేస్తారని సమాచారం. అక్టోబర్ 16న వరంగల్‌ జరిగే సభలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్‌ కంటే మెరుగైన హామీలను ఇందులో పొందుపరుస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.ఇందుకు సంబంధించి బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ హింట్‌ కూడా ఇచ్చారు. పేదలకు, మహిళలకు స్పెషల్‌ ప్యాకేజీలు ఉంటాయన్నారు.

Tags:    
Advertisement

Similar News