నా బిడ్డ ముత్యంలాగా బయటకొస్తది.. లిక్కర్ స్కాంపై కేసీఆర్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో భాగంగా బి.ఎల్.సంతోష్‌ను అరెస్టు చేసేందుకు తెలంగాణ పోలీసులను పంపించామని.. ఆ కక్ష పెంచుకుని ఇప్పుడు కవితను అరెస్టు చేశారన్నారు కేసీఆర్.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుపై మరోసారి స్పందించారు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. లిక్కర్ స్కామ్ అనేది బోగస్ అన్నారు. టీవీ-9 డిబేట్‌లో పాల్గొన్న కేసీఆర్.. లిక్కర్ స్కామ్ అనేది నరేంద్రమోడీ సృష్టి అని చెప్పుకొచ్చారు. అందులో స్కామ్ ఎక్కడుందన్నారు. అది ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీ అని చెప్పుకొచ్చారు. లెఫ్టినెంట్ గవర్నర్‌ను అడ్డం పెట్టుకుని పిటిషన్ వేయించి ఈ కేసును సృష్టించారన్నారు కేసీఆర్.
లిక్కర్ స్కామ్ కేసు నుంచి తన కూతురు కవిత కడిగిన ముత్యం లాగా బయటకొస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. ముందుగా కవితను సాక్షిగా విచారించి.. ఇప్పుడు అపరాధి అంటున్నారన్నారు కేసీఆర్. ఇదే కేసులో బీజేపీకి 50-60 కోట్లు ఫండ్స్ ఇచ్చి బెయిల్‌పై బయటకొచ్చారన్నారు కేసీఆర్. రెండున్నరేళ్లుగా ఈ కేసు నడుస్తోందని.. ఇప్పటివరకు ఒక్క ఆధారం కూడా దొరకలేదని చెప్పుకొచ్చారు. ఒక్క పైసా కూడా రికవరీ చేయలేదన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఓ ఎమ్మెల్సీకి బెయిల్ ఇవ్వకపోవటం ఏంటని కేసీఆర్ ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో భాగంగా బి.ఎల్.సంతోష్‌ను అరెస్టు చేసేందుకు తెలంగాణ పోలీసులను పంపించామని.. ఆ కక్ష పెంచుకుని ఇప్పుడు కవితను అరెస్టు చేశారన్నారు కేసీఆర్. ఢిల్లీలో మూడు సార్లు కేజ్రీవాల్ చేతిలో భంగపాటుకు గురై.. ఆయనను డీఫేమ్ చేసేందుకు ఈ కేసులో ఇరికించారన్నారు కేసీఆర్.