మూడు స్థానాలపై త్వరలో క్లారిటీ.. కేసీఆర్ కీలక సమీక్ష
లోక్ సభ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు కేసీఆర్. అభ్యర్థుల్ని ఖరారు చేసి ప్రచార పర్వానికి తెరతీయాలని భావిస్తున్నారు.
లోక్ సభ నియోజకవర్గాల వారీగా నేతలతో కీలక సమీక్షలు నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల నేతలతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. కాంగ్రెస్, బీజేపీ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని, ఆ పార్టీలు తెలంగాణకు చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరించాలని నేతలకు సూచించారు. తెలంగాణకు కాంగ్రెస్ చేసిందంతా ద్రోహమేనని, ఏనాడూ ఆ పార్టీ నాయకులు ప్రజల పక్షాన లేరని చెప్పారు. పదేళ్లలో బీజేపీ, తెలంగాణకు చేసిన మేలు ఒక్కటీ లేదన్నారు కేసీఆర్. ఆ రెండు పార్టీలతో తెలంగాణకు, ప్రజలకు ఉపయోగం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంతో తలపడాలన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలన్నా బీఆర్ఎస్ వల్లే సాధ్యమవుతుందన్నారు కేసీఆర్.
చైవెళ్ల సీటు కాసానికేనా..?
చేవెళ్ల లోక్‌సభ స్థానం విషయంలో కేసీఆర్ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు సబిత, అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ఈ సమావేశానికి హాజరయ్యారు. చేవెళ్ల నుంచి కాసాని అభ్యర్థిత్వం ఖరారైనట్టు ప్రచారం జరుగుతోంది. అయితే కేసీఆర్ మాత్రం ఒకటిరెండు రోజుల్లో నిర్ణయం తీసుకుందామని నేతలకు చెప్పారు.
ఇక నల్గొండ, భువనగిరి స్థానాల విషయంలో కూడా ఆశావహులతో మాట్లాడారు కేసీఆర్. నల్గొండ టికెట్ పై మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపురెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి సహా మరికొందరు ఆశ పెట్టుకున్నారు. భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, జిట్టా బాలకృష్ణారెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, క్యామ మల్లేశ్ పోటీ చేయాలనుకుంటున్నారు. ఆ రెండు స్థానాలపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు కేసీఆర్. అభ్యర్థి విషయంలో స్థానికంగా చర్చించి తన వద్దకు రావాలని సూచించారు. లోక్ సభ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు కేసీఆర్. అభ్యర్థుల్ని ఖరారు చేసి ప్రచార పర్వానికి తెరతీయాలని భావిస్తున్నారు.