కాంగ్రెస్ కి కౌంటర్ గా కేసీఆర్ ప్రతివ్యూహం
ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో కీలక భేటీలు నిర్వహిస్తున్నారు కేసీఆర్. నేతలతోపాటు వచ్చిన కార్యకర్తలకు కూడా ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారు.
బీఆర్ఎస్ పై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. విడతల వారీగా ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలను తనవైపు లాగేసుకుంది. ఈ కౌంట్ ఇక్కడితో ఆగదంటూ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇప్పటి వరకూ ఎమ్మెల్యేలు చేజారుతున్నా బీఆర్ఎస్ ధీమాగానే ఉంది, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతి వ్యూహంతో సిద్ధమయ్యారు. ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదంటున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వేదికగా ప్రతి వ్యూహం అమలు చేస్తున్నారు కేసీఆర్.
ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో కీలక భేటీలు నిర్వహిస్తున్నారు కేసీఆర్. నేతలతోపాటు వచ్చిన కార్యకర్తలకు కూడా ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారు. ఫామ్ హౌస్ కి వచ్చిన ప్రతి కార్యకర్తను, అభిమానిని ఆయన ఆప్యాయంగా పలకరిస్తున్నారు. బుధవారం కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ జనసందోహంతో కనిపించింది. జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ వారు నినాదాలు చేశారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమై వారికి భరోసా ఇస్తున్నారు. తొందరపడొద్దని, కాంగ్రెస్ ప్రలోభాలకు లొంగవద్దని చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైందని, ఆ పార్టీలో కొత్తగా చేరినవారెవరికీ రాజకీయ భవిష్యత్ ఉండదని నేతలతో అన్నారు. వెళ్లిపోయినవారి గురించి ఆలోచించొద్దని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి ఇంకెవరూ కాంగ్రెస్ తో టచ్ లో లేరని, ఆ పార్టీ కేవలం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎమ్మెల్యేలతో కేసీఆర్ నేరుగా సమావేశం కావడం, సముదాయించడం, తగిన టైమ్ కేటాయించడంతో.. ప్రస్తుతానికి బీఆర్ఎస్ లో పరిస్థితులు కుదుటపడ్డాయనే అనుకోవాలి.