నాలుగోసారి బీఫామ్, రూ.40 లక్షల చెక్.. కూసుకుంట్ల ఏమన్నారంటే..?

మునుగోడు ఉప ఎన్నికల ప్రచార ఖర్చు నిమిత్తం పార్టీ ఫండ్ నుంచి రూ.40 లక్షల చెక్‌ను అభ్యర్థి కూసుకుంట్లకు అందించారు సీఎం కేసీఆర్. బీఫామ్ అందించే సందర్భంలోనే ప్రచార ఖర్చునిమిత్తం చెక్‌ని కూడా కూసుకుంట్లకు ఇచ్చారు.

Advertisement
Update:2022-10-07 20:11 IST

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలో దిగుతున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ చేతుల మీదుగా నాలుగోసారి బీఫామ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నాలుగోసారి తనను నమ్మి బీఫామ్ అప్పగించిన కేసీఆర్‌కి కృతజ్ఞుడిగా ఉంటానని చెప్పారు. మనుగోడు విజయాన్ని ఆయనకు కానుకగా అందిస్తానన్నారు. బీజేపీకి అక్కడ డిపాజిట్ గల్లంతవుతుందని, ఆ పార్టీ మూడో స్థానానికి పరిమితం అవుతుందని చెప్పారు కూసుకుంట్ల. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజల గౌరవం పోగొట్టారని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాకుండా, కేవలం ఆయన అభివృద్ధి కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారన్నారు. మునుగోడు నియోజకవర్గ హద్దులు కూడా కోమటిరెడ్డికి తెలియవని ఎద్దేవా చేశారు. తన అభ్యర్థిత్వాన్ని పార్టీలో ఎవరూ వ్యతిరేకించ లేదని స్పష్టం చేశారు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల.

రూ.40 లక్షల చెక్..

మునుగోడు ఉప ఎన్నికల ప్రచార ఖర్చు నిమిత్తం పార్టీ ఫండ్ నుంచి రూ.40 లక్షల చెక్‌ను అభ్యర్థి కూసుకుంట్లకు అందించారు సీఎం కేసీఆర్. బీఫామ్ అందించే సందర్భంలోనే ప్రచార ఖర్చునిమిత్తం చెక్‌ని కూడా కూసుకుంట్లకు ఇచ్చారు. అయితే బీఫామ్ తీసుకున్నా కూడా తొలిరోజు కూసుకుంట్ల నామినేషన్ దాఖలు చేయలేదు.

తొలిరోజు రెండే నామినేషన్లు..

ఈ రోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది, నామినేషన్లు స్వీకరణ కూడా ప్రారంభమైంది. తొలిరోజు సమయం పూర్తయ్యే సరికి కేవలం రెండు నామినేషన్లే దాఖలయ్యాయి. ప్రజా ఏక్తా పార్టీ నుంచి నాగరాజు నామినేషన్ వేయగా, స్వతంత్ర అభ్యర్థిగా మారం వెంక‌ట్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ దాఖ‌లు చేశారు. టీఆర్ఎస్ ప్రకటనతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల్ని ఖరారు చేసినట్టయింది. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాలు అట్టహాసంగా జరుగుతాయని తెలుస్తోంది. ఈ రోజుతో గడువు మొదలు కాగా.. ఈ నెల 14 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులకు అవకాశముంది. 15న నామినేషన్ల పరిశీలన మొదలవుతుంది. 17వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. నవంబర్ 3న ఉప ఎన్నిక జరుగుతుంది. 6వ తేదీ ఫలితాలు విడుదలవుతాయి.

Tags:    
Advertisement

Similar News