అభ్యర్థుల ప్రకటన తర్వాత మెదక్ లో కేసీఆర్ తొలి సభ

మెదక్ వేదికగా రేపు సీఎం కేసీఆర్ ప్రగతి శంఖారావం పూరిస్తారని తెలిపారు మంత్రి హరీష్ రావు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదటి సభ నూతన ఉత్సాహంతో జరుగుతుందన్నారు.

Advertisement
Update:2023-08-22 17:15 IST

బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. జాబితా ప్రకటించిన అనంతరం ఆశావహులు ఆగం కావొద్దంటూ క్లుప్తంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. రేపు మెదక్ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. మెదక్ వేదికపై ఆయన వాడి వేడి ప్రసంగం ఉంటుందని అంచనా. దివ్యాంగుల పెన్షన్లను రూ.4016కు ఇటీవల పెంచగా, మెదక్ సభ నుంచే వాటిని లబ్ధిదారులకు అందించబోతున్నారు. బీడీ టేకేదార్లకు పెన్షన్ కార్యక్రమాన్ని కూడా మెదక్ వేదికగా సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. మెదక్ సభ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు పరిశీలించారు.

మెదక్ వేదికగా రేపు సీఎం కేసీఆర్ ప్రగతి శంఖారావం పూరిస్తారని తెలిపారు మంత్రి హరీష్ రావు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదటి సభ నూతన ఉత్సాహంతో జరుగుతుందన్నారు. కేసీఆర్ వ్యూహాన్ని ఎవరూ ఊహించలేదని, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనతో విపక్షాలు కకావికలం అవుతున్నాయని చెప్పారు. మెదక్‌లో పదికి పది సీట్లు పక్కా గెలిచి సీఎం కేసీఆర్‌ కు బహుమతిగా ఇస్తామని స్పష్టం చేశారు హరీష్ రావు. 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నా, వారిని ఆదుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. బీడీ టేకేదార్లకు కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మెదక్ వేదికగా సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని చెప్పారు.


కాంగ్రెస్ కి లీడర్లు లేరు, బీజేపీకి కేడర్ లేదు..

ఏ రాజకీయ పార్టీ కూడా ఒకే సారి ఇంత పెద్ద మొత్తంలో సీట్లు ప్రకటించలేదని గుర్తుచేశారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ లో లీడర్లు లేరని, బీజేపీకి కేడర్ లేదని ఎద్దేవా చేశారు. యువత, విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలు బీఆర్‌ఎస్‌ కు జై కొడుతున్నారని చెప్పారు. తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే గులాబీ జెండా మళ్లీ ఎగరాల్సిందేనని స్పష్టం చేశారు హరీష్ రావు. తెలంగాణ పథకాలను బీజేపీ కాపీ కొడుతోందని, అయితే తాము పూర్తి ఉచితంగా ఆర్థిక లబ్ధి చేకూరుస్తుంటే, కేంద్రం లోన్ల రూపంలో ఇస్తోందని అదే తేడా అని చెప్పారు. 

*

Tags:    
Advertisement

Similar News