కేసీఆర్ - రైతు రుణమాఫీ.. మోదీ - కార్పొరేట్ రుణమాఫీ
కేంద్ర ప్రభుత్వం కూడా రుణమాఫీ చేస్తోంది. అయితే దాని ద్వారా లాభం చేకూరేది రైతులకు కాదు, కేవలం కార్పొరేట్ సంస్థల అధిపతులకు. కేంద్రం ఇప్పటి వరకూ బ్యాంకుల ద్వారా కార్పొరేట్ రుణాలను మాఫీ చేసింది. వాటి విలువ అక్షరాలా రూ.14.5 లక్షల కోట్లు.
తెలంగాణలో రైతు రుణమాఫీ ఈరోజునుంచి మొదలైంది. ఈ విడతలో 19వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేయబోతున్నారు. నెలన్నర రోజులు టార్గెట్ పెట్టుకుని రైతులందరికీ రుణమాఫీ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. కేసీఆర్ ప్రకటనతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కేంద్రం వ్యవహారం కూడా ఇప్పుడు చర్చకు వచ్చింది.
కేంద్ర ప్రభుత్వం కూడా రుణమాఫీ చేస్తోంది. అయితే దాని ద్వారా లాభం చేకూరేది రైతులకు కాదు, కేవలం కార్పొరేట్ సంస్థల అధిపతులకు. అవును, కేంద్రం ఇప్పటి వరకూ బ్యాంకుల ద్వారా కార్పొరేట్ రుణాలను మాఫీ చేసింది. వాటి విలువ అక్షరాలా రూ.14.5 లక్షల కోట్లు. అంత పెద్ద మొత్తంలో కార్పొరేట్లకు మేలు చేకూర్చిన మోదీ, రైతుల్ని పట్టించుకోకపోవడం గమనార్హం. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వం 36వేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేస్తోంది. రెండు ప్రభుత్వాలకు తేడా చూడండి అంటూ సోషల్ మీడియాలో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.
భారత్ రైతు సమితి..
బీఆర్ఎస్ అంటే భారత్ రాష్ట్ర సమితి, అయితే అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో దేశ ప్రజలకు భరోసా ఇస్తున్న కేసీఆర్, భారత్ రైతు సమితిగా బీఆర్ఎస్ ని తీర్చిదిద్దుతున్నారని అంటున్నారు మంత్రి కేటీఆర్. రైతు సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా రైతు రుణమాఫీతో మరోసారి ఈ చర్చ మొదలైంది. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తుంటే, తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోందని సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.