కేసీఆర్ డిశ్చార్జ్.. ఆస్పత్రి నుంచి నేరుగా అక్కడికే..
ఇక్కడే 6 నుంచి 8 వారాలపాటూ ట్రీట్‌మెంట్ కొనసాగనుంది. అప్పటికి కేసీఆర్ పూర్తిగా కోలుకుంటారు. తిరిగి ఎప్పటిలాగే రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. యశోద నుంచి నేరుగా నందినగర్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. డిశ్చార్జ్ సమయంలో వీల్ చైర్‌లో కనిపించారు కేసీఆర్. మాజీమంత్రులు కేటీఆర్, హరీష్‌రావు కేసీఆర్‌ను ఇంటికి తీసుకెళ్లారు. ఉద్యమ సమయం నుంచి సీఎం అయ్యేదాకా నందినగర్ నివాసంలోనే ఉన్నారు కేసీఆర్. ఇక్కడే 6 నుంచి 8 వారాలపాటూ ట్రీట్‌మెంట్ కొనసాగనుంది. అప్పటికి కేసీఆర్ పూర్తిగా కోలుకుంటారు. తిరిగి ఎప్పటిలాగే రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.
డిసెంబర్ 7న రాత్రి ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లోని బాత్‌రూంలో కాలు జారి పడ్డారు కేసీఆర్. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని యశోదా ఆస్పత్రిలో చేర్చారు. కేసీఆర్ తుంటి ఎముక విరిగిపోవడంతో, డాక్టర్లు డిసెంబర్ 8న హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు. మరో ఎముకను అమర్చారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. కానీ, పూర్తిగా కోలుకోవడానికి 6 నుంచి 8 వారాలు పడుతుందని డాక్టర్లు ముందే చెప్పారు. ఇప్పుడు ఆరోగ్యం కాస్త మెరుగవ్వడంతో ఆయన్ని డిశ్చార్జ్ చేశారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ దూరం ఉండటంతో.. దగ్గర్లోనే ఉన్న నందినగర్‌లోని తన ఇంటికి తీసుకెళ్లారు. కేసీఆర్ తన నివాసానికి చేరుకోవడంతో అక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.