తెలంగాణలో అమలవుతున్న పథకాలను మీరూ అమలు చేస్తే నేను మహారాష్ట్రలో అడుగుపెట్టను... దేవేంద్రఫడ్నవీస్ కు కేసీఆర్ సవాల్

దేశాన్ని 54 ఏళ్లు కాంగ్రెస్, 14 ఏళ్లు బీజేపీ పాలించి చేసిందేమీ లేదని కేసీఆర్ విమర్శించారు. కృష్ణా, గోదావరి నదులు పుట్టే మహారాష్ట్రలో సాగు, తాగు నీరు చాలా చోట్ల అందుబాటులో లేదని చెప్పారు. పాలకులు మారుతున్నా ప్రజల తలరాత మాత్రం మారడం లేదని అన్నారు.

Advertisement
Update:2023-03-26 18:32 IST


'నాకు మహారాష్ట్రలో ఏం పని అని మ‌హారాష్ట్ర ఉప‌ ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ అడుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తే మ‌హారాష్ట్ర‌కు రానే రాను'' అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

మహారాష్ట్రలోని లోహా పట్టణంలో లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన బ‌హిరంగ సభ లో కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ‌లో రైతులకు ఎకరాకు పది వేల రూపాయల రైతు బంధు ఇస్తున్నాం, 24 గంటల ఉచిత‌ క‌రెంట్ ఇస్తున్నాం. 5 లక్షల రూపాయల‌ రైతుబీమా అమ‌లు చేస్తున్నాం. పండించిన ప్ర‌తి పంట‌ను పూర్తిగా కొనుగోలు చేస్తున్నాం, ద‌ళిత బంధు పథకం కింద ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇస్తున్నాం.తెలంగాణ త‌ర‌హా అభివృద్ధి ఫ‌డ్న‌వీస్ చేస్తే నేను మ‌హారాష్ట్ర‌కు రాన‌ని ప్ర‌క‌టిస్తున్నాన‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

''నేను మహారాష్ట్రకు రావద్దని మీరు సీరియస్ గా అనుకుంటే తెలంగాణలో మేము చేస్తున్న పనులన్నీ చేయండి. అప్పటి వరకు నేను మహారాష్ట్రకు వస్తూనే ఉంటాను.'' అని కేసీఆర్ అన్నారు.

తమ ప్రాంతంలో సభ పెట్టాలని కోరుతూ మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి వినతులు వస్తున్నాయని... తర్వాతి సభను షోలాపూర్ లో పెడతామని కేసీఆర్ చెప్పారు. నాందేడ్ లో తాము సభ పెట్టిన వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ. 6 వేలు జమ చేసింద‌ని... బీఆర్ఎస్ సభ సత్తా ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని అన్నారు. రైతులు ఐక్యంగా ఉండి పిడికిలి బిగిస్తే న్యాయం జరుగుతుందని చెప్పారు. ఒకప్పుడు మహారాష్ట్ర కంటే తెలంగాణ దారుణంగా ఉండేదని... ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా మారిందని అన్నారు. మహారాష్ట్రలో సంపదకు కొదవ లేదని... అయితే దాన్ని ప్రజలకు ఇవ్వాలన్న ఆలోచన పాలకులకు లేదని చెప్పారు.

దేశాన్ని 54 ఏళ్లు కాంగ్రెస్, 14 ఏళ్లు బీజేపీ పాలించి చేసిందేమీ లేదని విమర్శించారు. కృష్ణా, గోదావరి నదులు పుట్టే మహారాష్ట్రలో సాగు, తాగు నీరు చాలా చోట్ల అందుబాటులో లేదని చెప్పారు. పాలకులు మారుతున్నా ప్రజల తలరాత మాత్రం మారడం లేదని అన్నారు. ఉల్లి, చెరుకు ధర కోసం రైతులు ప్రతిఏటా పోరాడాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఊర్లో గులాబీ జెండా ఎగరేయాలని ఆయన మహారాష్ట్ర ప్రజలకు పిలుపు ఇచ్చారు. బీఆర్ ఎస్ ను గెలిపించుకోవడం ద్వారానే దేశంలో రైతు రాజ్యాన్ని స్థాపించగలమనికేసీఆర్ అన్నారు.

Tags:    
Advertisement

Similar News