అన్నార్తుల ఆకలి తీరుస్తున్న 'కేసీఆర్ బువ్వకుండ'

దవాఖానాకు చికిత్స కోసం వచ్చే రోగుల వెంట వచ్చే బంధువులు తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి కాస్తైనా సాయం చేయాలని ప్రారంభించిందే 'కేసీఆర్ బువ్వకుండ'.

Advertisement
Update:2023-06-27 09:53 IST

మనిషికి ప్రధానంగా కావలసింది తిండి, బట్ట, గూడు. మిగతా రెండింటి మాట ఎట్లా ఉన్నా.. ప్రతీ పూట తినడానికి ఇంత తిండి మాత్రం తప్పని సరిగా కావాలి. నగరాలు, పట్టణాలకు విద్య, వైద్యం కోసం వచ్చే పేదలు.. తిండి కోసం ఎంతో తిప్పలు పడుతుంటారు. ఉద్యోగ, ఉపాధి అన్వేషణలో కొత్త ఊరికి వచ్చి.. డబ్బులు లేక పస్తులు ఉండేవారు అనేక మంది కనపడుతుంటారు. ముఖ్యంగా దవాఖానాకు చికిత్స కోసం వచ్చే రోగుల వెంట ఉండే బంధువులు తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి కాస్తైనా సాయం చేయాలని ప్రారంభించిందే 'కేసీఆర్ బువ్వకుండ'.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి, బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం ఎంతో మంది రోగులు వస్తున్నారు. వారికి తోడుగా వచ్చే బంధువులు తిండి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే శిక్షణ కోసం వచ్చే నిరుద్యోగులు కూడా పస్తులు ఉంటున్నారు. వారి బాధను తెలుసుకొని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో సొంత ఖర్చుతో 'కేసీఆర్ బువ్వకుండ'ను ప్రారంభించారు. 2017 నవంబర్ నుంచి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 'కేసీఆర్ బువ్వకుండ' ద్వారా ఉచితంగా భోజనాలు పంపిణీ చేస్తున్నారు.

రెండేళ్ల క్రితం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా బువ్వకుండను ప్రారంభించారు. ఈ రెండు ఆసుపత్రుల్లో నిత్య అన్నదానం వల్ల వెయ్యి మంది కడుపు నిండా భోజనం చేస్తున్నారు. రోగుల బంధువులు, అనాథలు, యాచకులు ఈ బువ్వకుండ భోజనంతో కడుపు నింపుకుంటున్నారు.

ఇక విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ఏడాది క్రితం నిజామాబాద్‌లోని రెండు గ్రంథాలయాల్లో, ప్రెస్ క్లబ్‌లో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఇక్కడ కూడా మరో వెయ్యి మంది నిత్యం భోజనం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ బువ్వకుండా ప్రతీ రోజు రెండు వేలకు పైగా మందికి ఉచితంగా భోజనం పెడుతున్నది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దీనికి సంబంధించిన ఖర్చును భారం అనుకోకుండా.. అవసరమైన నిధులు ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజలు ఇక్కడ భోజనం చేసి.. రెండు చేతులెత్తి మొక్కిన సందర్భాలు కూడా ఉన్నాయని వారు అంటున్నారు. పేదల కష్టాలను ఇలా తీరుస్తున్నందుకు కవితకు వారు ధన్యవాదాలు తెలిపుతున్నారు.

Tags:    
Advertisement

Similar News