బీఆర్ఎస్ పబ్లిసిటీ కోసం కేసీఆర్ భారీ ప్లాన్

బీఆర్ఎస్ గురించి జాతీయ మీడియాలో విస్తృతమైన కవరేజ్ వచ్చేలా కేసీఆర్ పక్కా ప్లాన్ సిద్ధం చేశారు. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న సీనియర్ జర్నలిస్టులు కొందరినీ పార్టీకి పీఆర్వోలుగా నియమించుకున్నట్లు తెలుస్తున్నది.

Advertisement
Update:2022-10-05 14:14 IST

అనుమానాలు తీరిపోయాయి.. తెరలు తొలిగిపోయాయి.. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేసేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఇకపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా ప్రస్థానం కొనసాగించనున్నది. తెలంగాణ ఉద్యమం కోసం టీఆర్ఎస్ పుట్టింది. కాబట్టి రాష్ట్రంలో ఆ పార్టీకి పెద్దగా పబ్లిసిటీ అవసరం పడలేదు. రాష్ట్ర ప్రజలంతా టీఆర్ఎస్‌ను ఆమోదించారు. చాలా త్వరగా ప్రజల్లోకి పార్టీ వెళ్లిపోయింది. కానీ జాతీయ పార్టీ విషయంలో మాత్రం చాలా కష్టపడాల్సిందే. దేశంలోని ప్రతీ రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను పరిచయం చేయాల్సి ఉంటుంది. అది అంత ఆషామాషీ వ్యవహారం కాదని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌కు తెలుసు.పార్టీని దేశవ్యాప్తంగా పరిచయం చేయడానికి ఇప్పటికే కేసీఆర్ భారీ వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది.

గత కొన్ని నెలలుగా బీఆర్ఎస్ కోసం కసరత్తు చేసిన కేసీఆర్.. పార్టీ నిర్మాణం, కమిటీల ఏర్పాటు, క్యాడర్‌ను సమకూర్చుకోవడం వంటి విషయాలతో పాటు పబ్లిసిటీ ఎలా చేయాలనే దానిపై కూడా సుదీర్ఘంగా కసరత్తు చేసినట్లు తెలుస్తున్నది. దేశవ్యాప్తంగా జాతీయ మీడియా సహా, ఇతర రాష్ట్రాల్లోని మీడియాలో కూడా బీఆర్ఎస్ పార్టీ గురించిన వార్తలు వచ్చేలా, చర్చ జరిగేలా ప్లాన్ రూపొందించారు. జాతీయ స్థాయిలో టాప్ రేటింగ్‌లో ఉండే ఇంగ్లీష్, హిందీ ఛానల్స్‌లో దక్షిణాది వార్తలపై పెద్దగా ఫోకస్ చేయరు. బీజేపీకి సంబంధించిన వార్తలు, భారీ ప్రమాదాలు జరిగితే తప్ప జాతీయ మీడియాలో దక్షిణాది రాష్ట్రాలకు పెద్దగా చోటు దక్కదు. కానీ, బీఆర్ఎస్ గురించి జాతీయ మీడియాలో విస్తృతమైన కవరేజ్ వచ్చేలా కేసీఆర్ పక్కా ప్లాన్ సిద్ధం చేశారు.

ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న సీనియర్ జర్నలిస్టులు కొందరినీ పార్టీకి పీఆర్వోలుగా నియమించుకున్నట్లు తెలుస్తున్నది. గతంతో బడా ఛానల్స్, పత్రికల్లో పని చేసిన వీళ్లు ఢిల్లీ జర్నలిస్ట్ సర్కిల్స్‌లో మంచి పేరున్న వారే. అంతే కాకుండా అనేక మంది రాజకీయ నాయకులతో విస్తృత సంబంధాలు కలిగి ఉన్నారు. అలాంటి నలుగురిని ఇప్పటికే పీఆర్వోలుగా నియమించారని.. ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన తర్వాత అక్కడి నుంచే వాళ్లు పని చేస్తారని తెలుస్తున్నది. ప్రస్తుతానికి మాత్రం టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యాలయం నుంచి పని చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే పలు జాతీయ పత్రికలు, టీవీ ఛానల్స్‌లో తెలంగాణలో కేసీఆర్ చేసిన అభివృద్ధి, విధానాలు, సంక్షేమ పథకాల గురించి విస్తృతంగా వార్తలు వస్తున్నాయి. గత రెండు వారాలుగా కేసీఆర్‌కు సంబంధించిన వార్తలు నిత్యం ప్రచురిస్తున్నారు. ఇకపై బీఆర్ఎస్ పార్టీ గురించి కూడా విస్తృతమైన కవరేజీ ఉండబోతోంది. అలాగే జాతీయ స్థాయిలో కేసీఆర్ ప్రవేశపెట్టబోయే సంక్షేమ పథకాలపై కూడా చర్చ జరుగనున్నది. గుజరాత్ మోడల్ కాదు తెలంగాణ మోడల్ దేశానికి అవసరం అని ప్రచారం చేయనున్నారు. ఉత్తరాది ప్రజలకు బీఆర్ఎస్ ఆవశ్యకత సరిగా అర్థం అయ్యేలా కొన్ని కార్యక్రమాలను కూడా రూపొందించే అవకాశం ఉన్నది. అలాగే సోషల్ మీడియాను కూడా వాడుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని.. త్వరలోనే సోషల్ మీడియా కార్యకర్తలు కూడా తమ పని ప్రారంభిస్తారని తెలుస్తున్నది.

Tags:    
Advertisement

Similar News