మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కర్నె ప్రభాకర్?

కేసీఆర్ కూడా నియోజకవర్గానికి సంబంధించి నాలుగు సర్వేలు చేయించినట్లు తెలుస్తుంది. ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసి సర్వే చేయించగా.. అందులో కర్నె ప్రభాకర్‌పై సానుకూలంగా ఉన్నట్లు తేలింది.

Advertisement
Update:2022-08-04 11:03 IST

ఇప్పుడు తెలంగాణ రాజకీయం అంతా మునుగోడు చుట్టే తిరుగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అక్కడ ఉపఎన్నిక వస్తుందని స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు రాజగోపాల్ తన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్‌కు ఇవ్వలేదు. రేపో మాపో ఆ లేఖను రాజగోపాల్ సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. స్పీకర్ ఆ రాజీనామాను ఆమోదించి, ఆ ఖాళీని అసెంబ్లీ కార్యదర్శి ఈసీకి తెలిపిన తర్వాతే మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ ఖరారు అవుతుంది. నవంబర్‌ లేదా డిసెంబర్‌లో మునుగోడుకు ఉపఎన్నిక వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నాయి.

కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి ఎలాగో బీజేపీలో చేరతారనే ప్రచారం ఉంది. కాబట్టి ఆయనే అక్కడ బీజేపీ క్యాండిడేట్. ఇక కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె స్రవంతి బరిలోకి ఉంటారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. మరి అధికార టీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేస్తారనేదే ఆసక్తికరంగా మారింది. ఈ ఉపఎన్నికపై టీఆర్ఎస్‌కు పెద్దగా ఆసక్తి లేకపోయినా.. కాంగ్రెస్, బీజేపీ ఆడిన నాటకంలో టీఆర్ఎస్ ఇప్పుడు తన సత్తా చాటుకోవల్సిన అవసరం వచ్చింది. మునుగోడులో ఎప్పటికైనా ఉపఎన్నిక వస్తుందని ముందుగానే అంచనా వేసుకున్న టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆ నియోజకవర్గంపై మొదటి నుంచే దృష్టిపెట్టారు. అందుకే ముందస్తుగా ఎన్నాళ్ల నుంచో పెండింగ్‌లో ఉన్న గట్టుప్పల్‌ను మండలంగా ప్రకటించేశారు.

ఇక మునుగోడులో గత రెండు నెలలుగా మంత్రి జగదీశ్‌రెడ్డి దగ్గరుండి మరీ పెండింగ్ పనులు పూర్తి చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ పనులను చక్కబెడుతూనే.. మరోవైపు టీఆర్ఎస్‌కు అవసరమైన బలాన్ని చేరుస్తున్నారు. నియోజకవర్గంలో కీలకమైన నాయకులు టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చేలా ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిపారు. మరోవైపు కేసీఆర్ కూడా నియోజకవర్గానికి సంబంధించి నాలుగు సర్వేలు చేయించినట్లు తెలుస్తుంది. ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసి సర్వే చేయించగా.. అందులో కర్నె ప్రభాకర్‌పై సానుకూలంగా ఉన్నట్లు తేలింది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సంస్థాన్ నారాయణ్‌పూర్‌కు చెందిన కర్నె ప్రభాకర్ ఒక జర్నలిస్టు. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్‌ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. మునుగోడు నుంచి ప్రభాకర్‌ను బరిలోకి దించాలని కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. చివరి వరకు గోప్యత పాటించే కేసీఆర్.. ఈసారి మునుగోడు షెడ్యూల్ రాగానే కర్నె ప్రభాకర్ పేరు ప్రకటిస్తారని తెలుస్తుంది. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి అనుచరులు, కార్యకర్తలు బలంగా ఉన్నారు. అయితే వాళ్లు కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తారా లేదా, బీజేపీ వైపు మొగ్గు చూపుతారా అనే విషయం తేలలేదు. ఈ ఉపఎన్నికను కాంగ్రెస్ చాలా సీరియస్‌గా తీసుకుంది. దీంతో ఇక్కడ ముక్కోణపు పోటీ తప్పదని తెలుస్తోంది.

కాంగ్రెస్ నుంచి వలస పోయిన రాజగోపాల్ పోటీలో ఉంటారు కాబట్టి.. కచ్చితంగా ఓట్లు చీలిపోతాయని టీఆర్ఎస్ భావిస్తోంది. కర్నె ప్రభాకర్ మొదటి నుంచి మునుగోడు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అక్కడి కార్యకర్తలతో ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయి. టీఆర్ఎస్ నుంచి మరి కొంతమంది టికెట్ ఆశిస్తున్నా.. కేసీఆర్ చేయించిన సర్వేల్లో కర్నె ప్రభాకర్‌ వైపే మొగ్గు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆయనకే టికెట్ కేటాయిస్తారనే ప్రచారం పార్టీలో జరుగుతుంది.

మునుగోడు నుంచి పోటీ చేయడానికి కూసుకుంట్ల ప్రభాకర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్, కర్నాటి విద్యా సాగర్, కంచర్ల కృష్టారెడ్డి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అధినేత కేసీఆర్ మాత్రం ప్రభాకర్ అభ్యర్థిత్వంపైనే ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది.

Tags:    
Advertisement

Similar News