ఓటుకు 6,000 రూపాయలిస్తామని ప్రకటించిన బీజేపీ నాయకుడు... కర్నాటకలో దుమారం

కర్ణాటకలోని బీజేపీకి చెందిన రాష్ట్ర మాజీ జలవనరుల శాఖ మంత్రి రమేష్ జార్కిహోళి భారీ వివాదానికి దారితీసిన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటుకు 6,000 రూపాయలు చెల్లిస్తుందని జార్కిహోళి ప్రకటించారు.

Advertisement
Update:2023-01-23 08:28 IST

కొందరు రాజకీయ నాయకులు తాము ఏం మాట్లాడినా, ఏం చేసినా తమను ఎవరూ ఏం చేయలేరని అనుకుంటు ఉంటారు. వాళ్ళు తమకు తాము చట్టానికి అతీతులమని భావిస్తూ ఉంటారు. ఎన్నికల్లో గెలవడం కోసం ఎంతకైనా తెగిస్తూ ఉంటారు. డబ్బులు పంచడం, అబద్దపు వాగ్దానాలు చేయడం...ఇలా ఏ పనులైనా చేస్తూ ఉంటారు. అలాంటి పనే చేశాడు ఓ బీజేపీ మాజీ మంత్రి.

కర్ణాటకలోని బీజేపీకి చెందిన రాష్ట్ర మాజీ జలవనరుల శాఖ మంత్రి రమేష్ జార్కిహోళి వివాదాస్పద‌ వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటుకు 6,000 రూపాయలు చెల్లిస్తుందని జార్కిహోళి ప్రకటించారు. డబ్బులు ఇవ్వకపోతే ఓటు వేయకండి అని  ఆయన చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎంత ఖర్చు పెడితే తాము అంతకన్నా పది కోట్లు ఎక్కువ ఖర్చుపెడతామని ఆయన చెప్పారు. 2021లో ఓ లైంగిక కుంభకోణం కేసులో బలవంతంగా రాజీనామా చేయాల్సివచ్చిన ఈ మాజీ మంత్రి బెళగావిలోని సులేబావి గ్రామంలో ఆయన మద్దతుదారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ‌న కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాల్కర్‌పై ఆరోపణలకు దిగారు.

"ఆమె నియోజకవర్గంలోని తన ఓటర్లకు బహుమతులు పంచుతున్నది. ఇప్పటి వరకు, ఆమె దాదాపు 3,000 రూపాయల విలువైన కుక్కర్, మిక్సర్ వంటి వంటగది ఉపకరణాలను ఇచ్చారు. మేము మీకు 6,000 రూపాయలు ఇస్తాము. మేము ఇవ్వకపోతే మా అభ్యర్థికి ఓటు వేయవద్దని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ”అని రమేష్ జార్కిహోళి అన్నారు.

కాగా నీటిపారుదల శాఖ మంత్రి గోవింద్ కర్జోల్ తక్షణమే రమేష్ జార్కిహోళి మాటలను ఖండించారు.

"మా పార్టీలో అలాంటి వాటికి తావు లేదు. మా పార్టీ ఒక సిద్ధాంతం మీద నిర్మించబడింది, ఆ సిద్దాంతాల‌ కారణంగానే తాము దేశంలో అధికారంలోకి వచ్చాము. నరేంద్ర మోడీ నాయకుడిగా రెండవసారి స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చారు" అని ఆయన అన్నారు. 2023 ఎన్నికల్లో కూడా స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తామని మంత్రి తెలిపారు.

ఎవరైనా స్టేట్‌మెంట్ ఇస్తే అది పార్టీ ప్రకటన కాదని.. అది ఆయన వ్యక్తిగత విషయం అని ఆయన అన్నారు.

కాగా మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి వ్యాఖ్యలను ఎన్నికల సంఘం గమనించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

"ఇది బిజెపిలో అవినీతి ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుంది. ఎన్నికల సంఘం లేదా ఐటీ లేదా ఈడీ ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు?" అని రాష్ట్ర పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే అన్నారు.

"ఆపరేషన్ కమలం వాస్తవం. రమేష్ జార్కిహోళి దానిని సమర్థిస్తున్నాడు. రెండున్నర లక్షల మంది ఓటర్లకు ఆయన ఈ ఆఫర్ ఇస్తున్నారు. ఇది చిన్న విషయం కాదు. ఇది బిజెపి నాయకుడి దుర్మార్గం కాదా? బిజెపికి ఈ డబ్బు అంతా ఎక్కడ నుండి వస్తుంది? ఎన్నికల కమిషన్ సుమోటోగా ఎందుకు విచారణ చేయ‌డం లేదు?" అని ఖర్గే అన్నారు.

.

'రమేష్ చెప్పినది రాజ్యాంగ విరుద్ధం, బీజేపీ ఎమ్మెల్యేలంతా 40 శాతం మంది అవినీతి చేస్తూ పార్టీలో మనుగడ సాగిస్తున్నారు. లంచాల ద్వారా కావాల్సినంత మొత్తం వసూలు చేశారు. ఇప్పుడు ఎన్నికల సమయంలోనూ బీజేపీ అదే పని చేయాలని ఆలోచిస్తోంది. ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌ దృష్టి సారించాలి. అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ నాగరాజు యాదవ్ అన్నారు.

మరోవైపు బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం అనేక అవినీతి ఆరోపణలతో సతమతమవుతోంది. గత ఏడాది, అధికార బీజేపీ బిల్డర్లు, కాంట్రాక్టర్లు, ఇతరుల నుండి 40 శాతం కమీషన్ తీసుకుంటుందనే ఆరోపణలను ప్రచారం చేయడానికి ప్రతిపక్ష కాంగ్రెస్ క్యాంపెయిన్ ప్రారంభించింది.

ఇది రాష్ట్రంలో భారీ రాజకీయ తుఫానును ప్రేరేపించింది. అనేక మంది కాంగ్రెస్ నాయకులను రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags:    
Advertisement

Similar News