కరీంనగర్ లో దారుణం: డస్టర్ తో విద్యార్ధి తల పగలగొట్టిన టీచర్
కరీంనగర్ పట్టణంలో వావిలాలపల్లిలో గల శ్రీచైతన్య పాఠశాలలో ఓ విద్యార్ధి పై డస్టర్ విసరి తీవ్రంగా గాయపరిచిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఐదవ తరగతి చదువుతున్న జయంత్ అనే విద్యార్ధి స్కూలుకు వెళ్ళే తొందరలో ఒక పుస్తకం మర్చిపోయి వెళ్ళాడు. ఈ కారణంగా ఇంగ్లీష్ టీచర్ ఆ విద్యార్థిపై అందుబాటులో ఉన్న డస్టర్ విసిరేసింది.
కార్పోరేట్ పాఠశాలలు, కాలేజీల ఆగడాలు మితిమీరి పోతున్నాయి. క్రమశిక్షణ పేరుతోను, తమ విద్యా విధానం పేరుతో పిల్లల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ విచక్షణ కోల్పోతున్నారు టీచర్లు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రయివేటు పాఠశాలల్లో ఇలా విద్యార్ధులను చిత్రహింసలకు గురి చేస్తున్న విషయాలు వెలుగుచూశాయి.
తాజగా కరీంనగర్ పట్టణంలో వావిలాలపల్లిలో గల శ్రీచైతన్య పాఠశాలలో ఓ విద్యార్ధి పై డస్టర్ విసరి తీవ్రంగా గాయపరిచిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఐదవ తరగతి చదువుతున్న జయంత్ అనే విద్యార్ధి స్కూలుకు వె|ళ్ళే తొందరలో ఒక పుస్తకం మర్చిపోయి వెళ్ళాడు. ఈ కారణంగా ఇంగ్లీష్ టీచర్ ఆ విద్యార్థిపై అందుబాటులో ఉన్న డస్టర్ విసిరేసింది. ఈ ఘటనలో విద్యార్థి తలకు గాయం కాగా హాస్పిటల్‌కు తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్ళారు . స్కూలుకు వెళ్ళి తమ కొడుకును చూపించాలని అడగ్గా యాజమాన్యం.. మీ కొడుకు బాగానే ఉన్నాడు ఏమీ కాలేదు. చిన్న దెబ్బేనని చెప్పారని అన్నారు. ఇంత చిన్న విషయానికి స్కూలు వరకు వచ్చి గొడవ చేస్తారా అంటూ ప్రశ్నించారని, తమతో వాగ్వావాదానికి దిగి దాడి చేశారని విద్యార్ధి తండ్రి ఆరోపించారు. యాజమాన్యం దాడి చేయడంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసుస్టేషన్‌లో పిర్యాదు చేశారు.
కార్పోరేట్ విద్యా సంస్థల్లో ఇటీవల ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. శిక్షణ పొందిన ఉపాధ్యాయులను కాకుండా డిగ్రీ, పిజీలు చేసిన వారిని ఎటువంటి ఉపాధ్యాయ శిక్షణ పొందని వారిని టీచర్లుగా నియమించుకోవడం వల్లే విద్యార్ధులతో ఎలా ప్రవర్తించాలో తెలియక పోవడంతో ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయని సీనియర్ ఉపాధ్యాయలు చెబుతున్నారు.