'కంటి వెలుగు' సూపర్ హిట్.. 1.5 కోట్ల లక్ష్యాన్ని దాటిన పరీక్షలు

రెండో విడతలో 21.66 లక్షల రీడింగ్ గ్లాసెస్ ఉచితంగా పంపిణీ చేశారు. మరో 17.41 లక్షల మంది పేషెంట్లకు ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ ఇచ్చారు. జూన్ 15 వరకు ఈ కార్యక్రమం కొనసాగనున్నది.

Advertisement
Update:2023-05-27 08:25 IST

ఆరోగ్య తెలంగాణ సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. కొత్త ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలను నెలకొల్పుతూనే.. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి అనేక పథకాలు అమలు చేస్తోంది. సీఎం కేసీఆర్ ఆలోచనల్లోంచి పుట్టిన 'కంటి వెలుగు' కార్యక్రమం కూడా అలాంటి ఒక అద్భుత పథకం. ప్రపంచంలో ఏ దేశంలోనూ, రాష్ట్రంలోనూ లేని విధంగా.. ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించడం ఒక రికార్డు. ఢిల్లీ, పంజాబ్ సీఎంలు కూడా ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని తమ రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పారు.

తొలి విడతలోనే లక్షలాది మందికి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు ఉచితంగా అందించారు. అవసరమైన వారికి సర్జరీలు కూడా ఉచితంగా ప్రభుత్వం చేయించింది. తొలి విడత విజయవంతం కావడంతో రెండో విడతను కూడా ప్రారంభించింది. కంటి వెలుగు రెండో విడతలో 1.5 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే ఈ సారి మరింత స్పందన లభించింది. ఇప్పటికే 1.5 కోట్ల లక్ష్యాన్ని దాటేశామని.. కంటి వెలుగు రెండో విడత పూర్తయ్యేసరికి 2 కోట్ల పరీక్షలు దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

కంటి వెలుగు శిబిరాల్లో సాధారణ కంటి పరీక్షలు చేసి.. వారికి అవసరమైన కళ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇన్ఫెక్షన్ల వంటివి ఉంటే మందులు కూడా ఇస్తున్నారు. అయితే క్లిష్టమైన కేసులు, తీవ్రమైన కంటి వ్యాధులు ఉన్న వారిని మాత్రం పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. ప్రభుత్వ కంటి ఆసుపత్రికే కాకుండా ఎల్వీ ప్రసాద్ వంటి పెద్ద ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా ప్రభుత్వం సర్జరీలు చేయిస్తోంది.

ఇటీవల కాలంలో సరోజినీ దేవి కంటి ఆసుపత్రి, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌లలో కంటి ఆపరేషన్లు 6 నుంచి 10 శాతం పెరిగాయి. కంటి వెలుగు కార్యక్రమం వల్లే ఈ సర్జరీల సంఖ్య పెరిగినట్లు అధికారులు తెలిపారు. తొలి విడతలో అన్ని పరీక్షలు చేసిన తర్వాత పెద్ద ఆసుపత్రికి రిఫర్ చేశారు. కానీ రెండో విడతలో మాత్రం.. క్రిటికల్ అని గుర్తించిన వెంటనే పెద్ద ఆసుపత్రులకు పంపారు. దీంతో పేషెంట్లకు కూడా వెంటనే సర్జరీలు చేయడానికి వీలు పడింది.

గ్లుకోమా, స్క్వింట్, ఆంబ్లియోఫియా, పెర్జియం, కాటరాక్ట్, కార్నియల్ సమస్యలకు పెద్దాసుపత్రుల్లో సర్జరీలు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖకు చెందిన అధికారి ఒకరు చెప్పారు. రెండో విడతలో 21.66 లక్షల రీడింగ్ గ్లాసెస్.. 17.41 లక్షల మంది పేషెంట్లకు ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ ఉచితంగా పంపిణీ చేశారు. జూన్ 15 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని.. ఇంకా ఎవరైనా పరీక్షలు చేయించుకోకపోతే.. దగ్గరిలోని శిబిరానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు.

Tags:    
Advertisement

Similar News