బీఆర్ఎస్ లోకి కంఠారెడ్డి.. సముచిత గౌరవం ఇస్తామన్న కేటీఆర్

పార్టీకోసం కష్టపడి పనిచేసే కంఠారెడ్డి వంటి నాయకుల్ని కాంగ్రెస్ బలవంతంగా బయటకు పంపించిందని అన్నారు మంత్రి కేటీఆర్. తన క్యాడర్ తో కలసి పార్టీలోకి వస్తున్న తిరుపతి రెడ్డికి ఆయన స్వాగతం పలికారు.

Advertisement
Update:2023-10-06 22:36 IST

మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కంఠారెడ్డి తిరుపతి రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబి కండువా కప్పుకున్నారు. నిన్న రాత్రి మంత్రి హరీష్ రావు మంతనాలు ఫలించడంతో ఈరోజు కంఠారెడ్డి గులాబిదళంలో చేరిపోయారు.


పదేళ్లుగా మెదక్ జిల్లాలో కాంగ్రెస్ బలోపేతం కోసం శాయశక్తులా కృషి చేసిన తనకు పార్టీ తీరని అన్యాయం చేసిందన్నారు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి. టికెట్ ఇస్తామని చెప్పి అధిష్టానం మోసం చేసిందని విమర్శించారు. ప్రజలతో మమేకమైన నాయకులకు కాకుండా డబ్బు సంచులతో వచ్చిన పారాచూట్ లీడర్లకి మాత్రమే టికెట్లు ఇస్తోందని మండిపడ్డారు. డబ్బు సంచులతో వచ్చిన వాళ్లకు పార్టీ టికెట్లు అమ్ముకుంటోందని ఆరోపించారు కంఠారెడ్డి. అలాంటి పార్టీలో తనలాంటి వారు ఉండలేరని, అందుకే ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేసేందుకు బీఆర్ఎస్ లో చేరానని చెప్పారు. మెదక్ జిల్లాలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరుతున్నారని అన్నారు. మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని మాటిచ్చారు. ఇంటి ఇంటికి.. గడపగడపకు తిరిగి ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థులకు అత్యధిక మెజార్టీ తీసుకొస్తామన్నారు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి.

సముచిత గౌరవం ఇస్తాం..

పార్టీకోసం కష్టపడి పనిచేసే కంఠారెడ్డి వంటి నాయకుల్ని కాంగ్రెస్ బలవంతంగా బయటకు పంపించిందని అన్నారు మంత్రి కేటీఆర్. తన క్యాడర్ తో కలసి పార్టీలోకి వస్తున్న తిరుపతి రెడ్డికి ఆయన స్వాగతం పలికారు. తిరుపతి రెడ్డితో పాటు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామన్నారు. వారికి సముచిత గౌరవాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు మంత్రి కేటీఆర్. 

Tags:    
Advertisement

Similar News