వైరల్ అవుతున్న కడియం వ్యాఖ్యలు.. కేసీఆర్ గురించి ఏమన్నారంటే..?

కేసీఆర్ ని తెలంగాణ జాతిపితగా కొనియాడారు కడియం శ్రీహరి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కూడా ఆయన కేసీఆర్ వెంటే ఉన్నారు.

Advertisement
Update:2024-03-29 07:38 IST

పార్టీకి గుడ్ బై చెబుతానన్న కేకే అయినా, పార్టీకి దూరం జరగాలనుకుంటున్న కడియం అయినా.. ఇప్పటి వరకూ బీఆర్ఎస్ లో సముచితస్థానాలు దక్కించుకున్నవారే. పార్టీనుంచి అందరికంటే ఎక్కువ లబ్ధి పొందినవారే. రోజలు వ్యవధిలో కీలక నేతలిద్దరూ పార్టీకి దూరం జరగాలనుకోవడం యాదృచ్ఛికమే. ఈ క్రమంలో గతంలో వారిద్దరూ కేసీఆర్ గురించి, బీఆర్ఎస్ గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కడియం శ్రీహరి, కేసీఆర్ ని తెలంగాణ జాతిపితగా కొనియాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కూడా ఆయన కేసీఆర్ వెంటే ఉన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామనుకోవడం కరెక్ట్ కాదని కాంగ్రెస్ కి హితవు పలికారు. తెలంగాణ సాధించిన నాయకుడిగా, తెలంగాణ జాతిపితగా, తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా కేసీఆర్ ఉండిపోతారని అన్నారు. అలాంటి కడియం శ్రీహరి రోజుల వ్యవధిలోనే ప్లేటు ఫిరాయించడం దారుణం.


కడియం కోసం రాజయ్య దూరం..

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ఎలాంటి పరిణామాలు జరిగాయో అందరికీ తెలుసు. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియం శ్రీహరికి అవకాశమిచ్చారు కేసీఆర్. అయినా రాజయ్య పార్టీని వదిలిపోవాలనుకోలేదు, కేసీఆర్ కి దూరం కాలేదు. స్టేషన్ ఘన్ పూర్ లో కడియం విజయానికి కృషి చేశారు. పార్టీ అక్కడ విజయం సాధించి కడియం ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత రాజయ్య, కడియంతో సర్దుబాటు చేసుకోలేక బీఆర్ఎస్ కి దూరం జరిగారు. అటు రాజయ్య వెళ్లిపోయారు, ఇటు కడియం శ్రీహరి కూడా వెళ్లిపోవాలనుకోవడం దురదృష్టకరం.

పరీక్షాకాలం..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే వలసలు ఉంటాయనుకున్నారు కానీ.. అప్పటికప్పుడు అందరూ సైలెంట్ గా ఉన్నారు. లోక్ సభ ఎన్నికలకు టైమ్ దగ్గరపడగానే కొంతమంది బీజేపీవైపు సర్దుకున్నారు. కొంతమంది వ్యవహారం ఊహించినదే. అయితే కాంగ్రెస్ లోకి వెళ్తున్న నాయకులు మాత్రం నిజంగానే బీఆర్ఎస్ కి షాకిచ్చారు. రంజిత్ రెడ్డి, దానం నాగేందర్, కేకే, కడియం.. ఇలా వీరంతా పార్టీకి నమ్మకస్తులుగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా పార్టీతోనే ఉంటారనే భ్రమ కల్పించారు. చివరికిప్పుడిలా తమ నిజస్వరూపాలు బయటపెట్టుకున్నారు. 

Tags:    
Advertisement

Similar News