తూచ్.. ఈవీఎంలలో మోసం జరిగింది - కేఏ పాల్

ఓ దశలో తాను భారీ ఆధిక్యంతో గెలవబోతున్నానని, తనకు సంబరాలు చేసుకునేందుకు అనుమతివ్వాలంటూ అధికారుల్ని కోరారు కేఏ పాల్. సంబరాలకు సంబంధించి సరంజామా తెచ్చుకుంటానంటూ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.

Advertisement
Update:2022-11-06 10:11 IST


మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఎంత కామెడీ చేశారో, పోలింగ్ రోజు రన్నింగ్ చేసి అంతకంటే మించిన హాస్యాన్ని పండించారు స్వతంత్ర అభ్యర్థి కేఏపాల్. చేతికి ఉంగరాలతో పోలింగ్ కేంద్రాల దగ్గర తిరుగుతూ హడావిడి చేశారు. చివరకు ఫలితాల రోజు కూడా మీడియా అంతా తనపైనే ఫోకస్ పెట్టేలా చేశారు కేఏ పాల్. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు ఆయన కూడా ఉదయాన్నే కౌంటింగ్ కేంద్రానికి చేరుకుని హడావిడి చేశారు.

సంబరాలకు అనుమతివ్వండి..

ఓ దశలో తాను భారీ ఆధిక్యంతో గెలవబోతున్నానని, తనకు సంబరాలు చేసుకునేందుకు అనుమతివ్వాలంటూ అధికారుల్ని కోరారు కేఏపాల్. సంబరాలకు సంబంధించి సరంజామా తెచ్చుకుంటానంటూ ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. 50వేల ఆధిక్యం తనకు వస్తుందన్నారు. తీరా మీడియా ముందుకొచ్చి ఈవీఎంలలో తప్పు జరిగిపోయిందని, అందుకే తనకు ఓట్లు తగ్గిపోతున్నాయని వివరించారు.

పాల్ ఓట్లు ఎన్ని..?

కేఏ పాల్ కి తొలి రౌండ్ లో 34 ఓట్లు వచ్చాయి. అయితే తొలిరౌండ్ లో నోటాకు వచ్చిన 29 ఓట్ల కంటే ఆయనకు ఎక్కువ ఓట్లు రావడం విశేషం. తనకు తక్కువ ఓట్లు రావడానికి కారణం పోలింగ్ సరిగ్గా జరగకపోవడమేనంటున్నారు కేఏపాల్. తప్పంతా ఈవీఎంలదేనంటున్నారు. తాను ముందునుంచీ బ్యాలెట్ ఓట్ కావాలని అడిగానని, కానీ ఎన్నికల కమిషన్ ఈవీఎంలను ఉపయోగించిందని చెప్పారు. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో పోలింగ్ జరగాలని వేడుకున్నా కుదరదన్నారని చెప్పారు. మూడో తేదీ ఎన్నికలు జరిగాయి కాబట్టి, నాలుగో తేదీ లెక్కింపు జరిగితే బాగుంటుందని, లెక్కింపు ఆలస్యం కావడం వల్లే ఈవీఎంలు తారుమారు చేసి తన మెజార్టీని దెబ్బకొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు కేఏ పాల్. డెమోక్రసీ డెడ్ అంటూ మీడియా ముందు స్టేట్ మెంట్ ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News