ఉదయాన్నే క్యూ లైన్లో బన్నీ, తారక్..
తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, మరోసారి పోలింగ్ బూత్ వద్ద మీడియాకు క్లారిటీ ఇచ్చారు అల్లు అర్జున్.
తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైంది. చాలా చోట్ల అభ్యర్థులు ముందుగా తమ ఓటు హక్కుని వినియోగించుకోడానికి ఉత్సాహం చూపించారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు తొలి గంటలోనే ఓటు వేసి సిరా చుక్క చూపిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద సందడి చేశారు. ఇక సెలబ్రిటీల లిస్ట్ లో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేర్లు మొదటగా వినిపిస్తున్నాయి. పోలింగ్ ప్రారంభం కావడానికంటే ముందే జూనియర్ ఎన్టీఆర్ పోలింగ్ బూత్ కి చేరుకున్నారు. క్యూ లైన్లో నిలబడి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు ఉన్నారు. గత రాత్రే ఆయన తన షూటింగ్ లు ముగించుకుని హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్ పోలింగ్ బూత్ లో జూనియర్ ఎన్టీఆర్ ఓటు వేశారు.
ఏపీలో తన స్నేహితుడికోసం ప్రచారానికి వెళ్లిన అల్లు అర్జున్, ఇప్పుడు తెలంగాణలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అల్లు అర్జున్ ని ఫొటోలు తీసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు చాలామంది ఉత్సాహం చూపించారు. ఓటింగ్ ఇంకా మొదలు కాక ముందే అల్లు అర్జున్ కూడా పోలింగ్ బూత్ కి చేరుకుని క్యూలైన్ లో నిలబడ్డారు.
పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా పోలింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే ఓటు వేయడానికి ఉత్సాహం చూపించారు. సెలబ్రిటీల పోలింగ్ కేంద్రాల లిస్ట్ నిన్నటినుంచే సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆయా కేంద్రాల వద్ద ఓటు వేయడానికి వచ్చే సెలబ్రిటీలను చూసేందుకు సామాన్య ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.