టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ కి ఇవ్వాలి.. తెలంగాణ మంత్రి ఆకాంక్ష

జూనియర్ ఎన్టీఆర్ ఎంత సైలెంట్ గా ఉన్నా, ఆయన పేరు పదే పదే ఏపీ రాజకీయాల్లో వినపడుతోంది. ఆ పేరు చంద్రబాబుకి చెవిపోటుగా మారింది.

Advertisement
Update:2022-12-23 06:16 IST

చంద్రబాబు ఖమ్మం టూర్ తెలంగాణలో టీడీపీకి ఏమాత్రం ఉపయోగపడిందో తెలియదు కానీ, ఆయన రాజకీయ ఎత్తుగడలపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఏపీలో ఏమీ చేయలేకే చంద్రబాబు తెలంగాణలో హడావిడి చేస్తున్నారనే సెటైర్లు పడుతున్నాయి. తెలంగాణ మంత్రి హరీష్ రావు, చంద్రబాబు చెల్లని రూపాయంటూ ఎద్దేవా చేశారు. తాజాగా మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా టీడీపీ అంతర్గత రాజకీయాలపై కామెంట్ చేశారు. ఎన్టీఆర్ ని మోసం చేసి చంద్రబాబు టీడీపీని లాగేసుకున్నారని, అసలా పార్టీ చంద్రబాబుది కాదని, ఆయన మధ్యలో వచ్చినవాడు అంటూ విమర్శించారు.

పగ్గాలు ఎన్టీఆర్ కి ఇవ్వాల్సిందే..

టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ కి ఇవ్వాల్సిందేనని అన్నారు మంత్రి ఎర్రబెల్లి. ఎన్టీఆర్ పై చంద్రబాబుకి నిజంగానే ప్రేమ ఉంటే నందమూరి కుటుంబానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కుట్రపూరితంగా కొడుకు లోకేష్ ను ఫోకస్ చేయాలని చంద్రబాబు చూస్తున్నారని అన్నారు. టీడీపీ నాయకులెవరూ లోకేష్ పెత్తనం కోరుకోవడం లేదని చెప్పారు. ఏపీ ప్రజలు జూనియర్ ఎన్టీఆర్ ని కోరుకుంటున్నారని, టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఉంటేనే బాగుంటుందని అన్నారు. తెలుగు దేశం, ఎన్టీఆర్ పై ప్రేమ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ని సీఎం చేయాలని చంద్రబాబుకి హితవు పలికారు.

ఇంత మోసమా..?

హరికృష్ణ బిడ్డను తెలంగాణ ఎన్నికల్లో నిలబెట్టి ఓడించారని మండిపడ్డారు మంత్రి ఎర్రబెల్లి. కావాలనే చంద్రబాబు ఆ కుటుంబం పరువు దిగజార్చుతున్నారని చెప్పారు. ఏపీలో పొద్దుపోక చంద్రబాబు మరోసారి తెలంగాణకు వస్తున్నాడని విమర్శించారు. తెలంగాణలో చిచ్చపెట్టేందుకు గతంలో కాంగ్రెస్ తో కలిసి పనిచేశాడని, ఇప్పుడు బీజేపీ డైరక్షన్లో కొత్త డ్రామా స్టార్ట్ చేశారన్నారు. కేఏపాల్, షర్మిల లాగే చంద్రబాబుని కూడా బీజేపీ వాడుకుంటోందని విమర్శించారు.

ఇప్పటి వరకూ వైసీపీ నేతలే చంద్రబాబు వెన్నుపోటు ఎపిసోడ్ గురించి మాట్లాడేవారు. పార్టీపై ఆయన పెత్తనం ఏంటని నిలదీసేవారు. జూనియర్ ఎన్టీఆర్ ని, ఆయన అభిమానుల్ని పరోక్షంగా రెచ్చగొట్టేవారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే పల్లవి అందుకోవడం విశేషం. మొత్తమ్మీద జూనియర్ ఎన్టీఆర్ ఎంత సైలెంట్ గా ఉన్నా, ఆయన పేరు పదే పదే ఏపీ రాజకీయాల్లో వినపడుతోంది. ఆ పేరు చంద్రబాబుకి చెవిపోటుగా మారింది.

Tags:    
Advertisement

Similar News