ఉద్యోగం అంటే బాధ్యత మాత్రమే కాదు.. ఉద్వేగం : సీఎం రేవంత్‌

'కొలువుల పండగ' కార్యక్రమంలోనూ మూసీ ప్రాజెక్టునే కలవరించిన సీఎం

Advertisement
Update:2024-10-06 18:40 IST

గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని ఏళ్లపాటు సాగదీసిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. లక్షలాదిమంది విద్యార్థులు, నిరుద్యోగులు పోరాడితేనే తెలంగాణ వచ్చిందన్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన 'కొలువుల పండగ' కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 1,635 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. తెలంగాణ వస్తేనే ఉద్యోగాలు వస్తాయని ఎంతో పోరాడారు. ఉద్యోగం అంటే బాధ్యత మాత్రమే కాదు.. ఉద్వేగం అని సీఎం అన్నారు. రాష్ట్ర పునర్‌ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇంజినీర్ల కృషి గొప్పతనం ఈ సమాజానికి చాలా అవసరం అన్నారు. 360 కి.మీ. రీజినల్‌ రింగ్‌ రోడ్డు, రేడియల్‌ రోడ్స్‌ మీ చేతుల మీదుగా నిర్మాణం కాబోతున్నాయి. ఎయిర్‌పోర్ట్‌కు కూతవేటు దూరంలో ఫ్యూచర్‌ సిటీ, ఫార్మాసిటీ నిర్మాణం కాబోతున్నాయి. 55 కి.మీ. మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు పూర్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలబెడుతామన్నారు.

ప్రజలు ఇచ్చిన అవకాశాన్నిఅందరం నిలబెట్టుకుందాం

మార్పు రావాలి, కాంగ్రెస్‌ గెలువాలన్న ఆలోచనతో నాడు నేను చేపట్టిన 'విద్యార్థి నిరుద్యోగ జంగ్‌ సైరన్‌'కు మీరంతా మద్దతిచ్చారు. కేసీఆర్‌, ఆయన కుటుంబంలోని వారి ఉద్యోగాలు పోతేనే పేదలకు ఉద్యోగాలు వస్తాయని నాడు చెప్పాను. నేను చెప్పినట్టే కేసీఆర్‌ ఉద్యోగం పోయింది. ఇప్పుడు పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయి. కొన్నేళ్ల నుంచి నియామకాలు జరగక, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక, లక్షలాది మంది నిరుద్యోగ యువకులు నిరాశ చెందారు. మా మంత్రివర్గం ఆలోచన చేసి సంవత్సరాల కొద్దీ వాయిదా పడుతున్న ప్రభుత్వ ఉద్యోగాలకు పరిష్కారం చూపెట్టిందన్నారు. మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చి వారి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూసే విధంగా చేశాం. ఈ నెల 9న సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో 11,063 టీచర్ల ఉద్యోగ నియామక పత్రాలు అందించబోతున్నాం. వందేళ్ల అనుభవం ఒకవైపు ఉంటే.. పదేళ్ల దుర్మార్గం ఒకవైపు ఉన్నది. విశ్వాసంతో ప్రజలు ఇచ్చిన అవకాశాన్నిఅందరం నిలబెట్టుకుందామన్నారు.

మూసీ పరివాహక ప్రజలు దశాబ్దాలుగా మురికిలోనే ఉండాలా?

నదుల పేర్లను ఎంతోమంది తమ పిల్లలకు పెట్టారు. చాలామందికి గంగ, యమున, కావేరి పేర్లు ఉంటాయి. మూసీ పేరును ఏ తండ్రి అయినా తమ కుమార్తెకు పెట్టుకున్నారా? మూసీ అంటే మురికి కూపమనే పేరు స్థిరపడింది. ప్రజలు నిరాశ్రయలు అవుతారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటారా? మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ, గంధమల్లు రిజర్వాయర్ల నిర్మాణం వల్ల ఎవరి భూములు పోలేదా? అని సీఎం ప్రశ్నించారు.మల్లన్న సాగర్‌ పేరుతో రైతులను బలవంతంగా ఖాళీ చేయించారు. మూసీ నిర్వాసితులకు మంచి స్థలంలో ఆశ్రయం కల్పిస్తామన్నారు. మూసీ పరివాహక ప్రజలు దశాబ్దాలుగా మురికిలోనే ఉండాలా? నిర్వాసితులను ఎలా ఆదుకోవాలో సలహాలు ఇవ్వండి అన్నారు. బీఆర్‌ఎస్‌ నిధులు రూ. 1500 కోట్లు దాటాయి. 2014 ముందు బీఆర్‌ఎస్‌ ఖాతాలో ఉన్నదెంత? ఇప్పుడెంత? పదేళ్లలో ఆ పార్టీ ఖాతాలోకి రూ. వందల కోట్లు ఎలా వచ్చాయని సీఎం ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News