ఈటల కొనుగోళ్లపై జితేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హుజూరాబాద్ లో ఉప ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్ ఎవరెవర్ని ఎలా కొనుగోలు చేశారనే విషయాన్ని వివరించారు జితేందర్ రెడ్డి.
ఆమధ్య దున్నపోతు ట్రీట్ మెంట్ అంటూ ట్వీట్ వేసి రచ్చ లేపి, ఆ తర్వాత డిలీట్ చేసి సైలెంట్ గా ఉన్న బీజేపీ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈటలను టార్గెట్ చేశారు. ఈటల గురించి జితేందర్ రెడ్డి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన వ్యాఖ్యల్ని మంత్రి కేటీఆర్ కూడా రీట్వీట్ చేశారంటే.. బీజేపీని జితేందర్ రెడ్డి ఎంత డ్యామేజ్ చేశారో అర్థం చేసుకోవచ్చు.
ఈటల అందర్నీ కొనేశారు..
హుజూరాబాద్ లో ఉప ఎన్నికల సమయం అది. ఆ ఎన్నికల్లో బీజేపీ తరపున జితేందర్ రెడ్డి గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు. ఆ సమయంలో ఏం జరిగిందనేది తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టారు. "సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు.. అందర్నీ ఈటల కొనేసి ఢిల్లీ ఫ్లైటెక్కారు. నా బలం ఇదీ అని బీజేపీ అధిష్టానానికి చూపించుకున్నారు. కట్ చేస్తే హుజూరాబాద్ వచ్చిన తర్వాత ఒక్కరు కూడా ఆయనతో మిగల్లేదు, అందరూ పారిపోయారు. జనాల్లో సానుభూతి ఉంది, కానీ అది ఓట్ల రూపంలో రావాలి కదా. ఆ పని నేను చేసి పెట్టాను." అంటూ హుజూరాబాద్ ఉప ఎన్నికల ఎపిసోడ్ గురించి వివరించారు జితేందర్ రెడ్డి. సర్పంచ్ లు, ఎంపీటీసీలను ఈటల కొనేశారు అనే వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఓ దశలో సీఎం కేసీఆర్ పాలనను కూడా ఆకాశానికెత్తేశారు జితేందర్ రెడ్డి. కేసీఆర్ పాలన అద్భుతంగా ఉందని, అందుకే ఇతర రాష్ట్రాలనుంచి కూడా నాయకులు ఇక్కడికి వచ్చి పథకాల అమలుని చూసి వెళ్తున్నారని చెప్పారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక మాత్రం పరిస్థితిలో తేడా వచ్చిందన్నారు. మొత్తానికి జితేందర్ రెడ్డి ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో రచ్చలేపుతోంది. ఈటల కొనుగోళ్ల వ్యవహారం హైలెట్ గా మారింది. అధిష్టానానికి నమ్మకస్తుడిగా ఉంటూనే, ఈటలను టార్గెట్ చేశారు జితేందర్ రెడ్డి.