మళ్లీ వార్తల్లోకెక్కిన జనగామ ఆస్పత్రి
తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది మరో నిదర్శనం అన్నారు మంత్రి హరీష్ రావు. జనగామ ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు.
తెలంగాణలో జనగామ జిల్లా కేంద్రంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ ఏడాది జనవరిలో కూడా జనగామ ఆస్పత్రి రికార్డుల్లోకెక్కింది. ఒకేరోజు 35మంది మహిళలకు ఇక్కడ ప్రసవం జరిగింది. ఒకేరోజు ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన ప్రసవాల్లో ఇదే అత్యధికం. ఆ రికార్డు ఇప్పటికీ జనగామ ఆస్పత్రి పేరుమీదే ఉంది. అయితే ఇప్పుడు రెండో అత్యధిక ప్రసవాల్లో కూడా అదే ఆస్పత్రి రికార్డు నమోదు చేసింది. తాజాగా జనగామ ఆస్పత్రిలో 24 గంటల వ్యవధిలో 31 ప్రసవాలు నమోదయ్యాయి. ఇందులో 17 సాధారణ కాన్పులు కాగా, 14 సిజేరియన్లు. 12మంది మగ శిశువులు, 19మంది ఆడబిడ్డలు.. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు.
ప్రసవాల రికార్డ్..
ప్రసవం అంటే మహిళలకు పునర్జన్మ లాంటిది. చిన్న చిన్న అనారోగ్యాల విషయంలో చాలామంది ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తుంటారు కానీ, ప్రసవం దగ్గరకు వచ్చే సరికి ఎక్కువగా ప్రైవేటు ఆస్పత్రులవైపే మొగ్గుచూపుతారు. నెలలు నిండేవరకు సాధారణ చెకప్ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లినా.. బిడ్డపుట్టే సమయానికి కొంతమంది ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తారు. కానీ జనగామ ప్రభుత్వ ఆస్పత్రి మాత్రం స్థానికంగా ఎంతోమంది నమ్మకాన్ని చూరగొంది. ప్రసవాలకోసం ప్రత్యేకంగా ఇక్కడకు వస్తుంటారు గర్భిణులు. సగటున రోజుకి 10నుంచి 12 ప్రసవాలు ఇక్కడ జరుగుతుంటాయి.
మంత్రి హరీష్ రావు హర్షం..
తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది మరో నిదర్శనం అన్నారు మంత్రి హరీష్ రావు. జనగామ ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. ఆరోగ్య తెలంగాణ సాకారం దిశగా కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ వైద్యబృందం అడుగులు వేస్తోందన్నారు.