జనగామ కాంగ్రెస్‌లో రచ్చ...మళ్లీ మొదటికి పంచాయితి..!

జనగామ కాంగ్రెస్‌ పంచాయితి మళ్లీ మొదటికి వచ్చింది. కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డిని జనగామ డీసీసీ అధ్యక్షుడిగా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు నేతలు ఏఐసీసీ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గేకు లేఖ రాశారు.

Advertisement
Update:2023-08-22 21:47 IST

జనగామ కాంగ్రెస్‌ పంచాయితి మళ్లీ మొదటికి వచ్చింది. కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డిని జనగామ డీసీసీ అధ్యక్షుడిగా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు నేతలు ఏఐసీసీ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గేకు లేఖ రాశారు. జనగామ కాంగ్రెస్ విధేయుల పేరుతో రాసిన ఈ లేఖ ఇప్పుడు ఆ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. జనగామ డీసీసీ అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని తప్పించాలని కోరారు.

కొమ్మూరి ప్రతాపరెడ్డి చాలా పార్టీలు మారి ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరారని, ఎన్నికల ముందు పార్టీలు మారడం ఆయనకు అలవాటేనని లేఖలో ఆరోపించారు. అసలు కొమ్మూరి జనగామ జిల్లా వాసే కాదని, సిద్దిపేట జిల్లాకు చెందిన వ్యక్తి అని వెల్లడించారు. కాంగ్రెస్ రాజ్యాంగం, రూల్స్‌ ప్రకారం డీసీసీ అధ్యక్షులుగా నియమితులయ్యేవారు అదే జిల్లాకు చెందినవారై ఉండాలన్న నిబంధన ఉందని లేఖలో వివరించారు. జనగామ,భువనగిరి, నిర్మల్ జిల్లాల అధ్యక్షుల నియామకం కోసం రేవంత్ రెడ్డి రాసిన సిఫార్సు లేఖలో...ఆ ముగ్గురు నేతలు సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలు అందిస్తున్నట్టు పేర్కొన్నారని, అది ముమ్మాటికీ పార్టీని తప్పుదోవ పట్టించడమేనని మండిపడ్డారు. భువనగిరి, జనగామ జిల్లాల డీసీసీ అధ్యక్ష పదవులకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఫార్సు చేసినట్లు రేవంత్ ఆ లేఖలో పేర్కొన్నారని...ఆయన సిఫార్సులను ఈ రెండు జిల్లాలకే ఎందుకు పరిగణలోకి తీసుకున్నారో చెప్పాలన్నారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారత్ జోడో యాత్రలోనే పాల్గొనలేదని...స్టార్ క్యాంపెనర్‌గా ఉండి కూడా మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేయలేదని లేఖలో ఆరోపించారు. అలాంటి వ్యక్తి జనగామ జిల్లాకు చేసిన సిఫార్సును ఎలా పరిగణలోకి తీసుకున్నారని ప్రశ్నించారు. స్థానికేతరులను డీసీసీ అధ్యక్షులుగా నియమించడం..స్థానిక కార్యకర్తలను తీవ్రంగా కలిసివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్ష నియామకాల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగిందని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 35 జిల్లా అధ్యక్ష పదవులకు 22 అగ్రవర్ణాలకే ఇచ్చారని, కేవలం 7 మాత్రమే బీసీలకు ఇచ్చారని తెలిపారు. కొందరు నేతలు పార్టీ నాయకత్వాన్ని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. కొమ్మూరి ఏ జిల్లా వ్యక్తో అధిష్టానానికి తెలియదని...అందుకే డీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కాంగ్రెస్‌ రాజ్యాంగం ప్రకారం స్థానిక వ్యక్తికే డీసీసీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News