మూడు రాష్ట్రాలు చేసి ముగ్గురూ పంచుకోండి..

షర్మిల పాదయాత్ర చేసినా, కాళ్ళు చేతులు కొట్టుకున్నా తెలంగాణలో గెలవలేదని అన్నారు జగ్గారెడ్డి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని చెప్పుకొచ్చారు.

Advertisement
Update:2022-09-27 15:30 IST

షర్మిల, జగ్గారెడ్డి మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. జగ్గారెడ్డికి షర్మిల కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఆయన ప్రెస్‌మీట్ పెట్టి షర్మిలను టార్గెట్ చేశారు. ఏపీకి మూడు రాజధానులు కాకుండా, ఏపీని మూడు ముక్కలు చేసి జగన్, షర్మిల, విజయమ్మ ఆ మూడు రాష్ట్రాలను పంచుకోవాలని సలహా ఇచ్చారు. అర్జెంటుగా సీఎం అయిపోవాలని షర్మిలకు కోరికగా ఉందన్న ఆయన.. ఆమె వ్యవహరం చుట్టరికం తోక పట్టుకొని తిరిగినట్టు ఉందని ఎద్దేవా చేశారు.

ఇది మీ ఇంటి పంచాయితీ..

వైఎస్ఆర్ కుటుంబ పంచాయితీని షర్మిల జనంపై రుద్దాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు జగ్గారెడ్డి. జగన్, షర్మిల మధ్య ఆస్తుల పంపకంలో వచ్చిన తేడా వల్లే ఆమె తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టిందన్నారు. విజయమ్మకి తానో సలహా ఇస్తున్నానని, అర్జెంటుగా జగన్ కి చెప్పి షర్మిలను సీఎం చేయాలని అన్నారు. ఏపీలో మూడు రాజధానుల పంచాయితీ నడుస్తుంటే, వైఎస్ కుటుంబంలో సీఎం సీటు పంచాయితీ నడుస్తోందని చెప్పారు. జగన్, మోదీకి గులాం అయ్యారని, ఆయన చలవతో మూడు రాష్ట్రాలు చేసుకుని ముగ్గురూ పంచుకోవచ్చని సెటైర్లు వేశారు.

ముమ్మాటికీ బీజేపీ ఏజెంటే..

షర్మిల బీజేపీ ఏజెంట్ అంటూ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీనిపై షర్మిల కౌంటర్ ఇవ్వగా.. మరోసారి జగ్గారెడ్డి అవే కామెంట్లు చేశారు. షర్మిల పాదయాత్ర చేసినా, కాళ్ళు చేతులు కొట్టుకున్నా తెలంగాణలో గెలవలేదని అన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని చెప్పుకొచ్చారు. బీజేపీకే ఎలా పోవాలో అర్థం కావట్లేదని, ఇక తెలంగాణలో షర్మిల న్యూసెన్స్ ఎందుకని ప్రశ్నించారు. అమ్మాయి కదా అని ఏం అనలేకపోతున్నానని, వైఎస్ఆర్ బిడ్డ కావడంతో ఆలోచిస్తున్నానని చెప్పారు జగ్గారెడ్డి. షర్మిల తగ్గకపోతే తాను చాలా విషయాలు బయటపెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News