టీఆర్ఎస్ ఎంపీల సస్పెన్షన్ సిగ్గుచేటు
రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ ఎంపీల సస్సెన్షన్ సిగ్గుచేటని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ ఎంపీల సస్సెన్షన్ సిగ్గుచేటని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుపై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు.
"ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిత్యావసరాల మీద జీఎస్టీ పెంపుపై చర్చకు అంగీకరించకుండా కేంద్ర ప్రభుత్వం టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలను రాజ్యసభ నుంచి 10 రోజుల పాటు సస్పెండ్ చేయాలని నిర్ణయించడం సిగ్గుచేటు. ప్రభుత్వం చర్చకు ఎందుకు భయపడుతోంది. ప్రతిపక్షాల గొంతు నొక్కడం ఎందుకు" అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
జీఎస్టీ, అధిక ధరలు, ద్రవ్యోల్బణంపై రాజ్యసభలో నిరసన తెలిపిన 19 మంది విపక్ష సభ్యులను డిప్యూటీ చైర్మన్ 10 రోజులపాటు సస్పెండ్ చేశారు. వీరిలో టీఆర్‌ఎస్‌కు చెందిన బడుగుల లింగయ్య యాదవ్, దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర కూడా ఉన్నారు. మిగిలిన 16 మందిలో ఏడుగురు తృణమూల్ కాంగ్రెస్, ఆరుగురు డీఎంకే, ఇద్దరు సీపీఎం, ఒక సీపీఐ ఎంపీ ఉన్నారు.
15 నెలల కాలంలో గ్యాస్ సిలిండర్ ధర 30 శాతం పెరిగిందని, గ్యాస్ సిలిండర్ పై ఇచ్చే సబ్సిడీ 24,172 కోట్ల నుంచి 242 కోట్లకు పరిమితమైందన్న ట్వీట్ ని కూడా కేటీఆర్ రీట్వీట్ చేశారు. గ్యాస్ పై భారం పెంచుతూ మరోవైపు సబ్సిడీని తగ్గిస్తూ కేంద్రం ప్రజల్ని దారుణంగా మోసం చేస్తోందన్నారు కేటీఆర్. బొగ్గు కొరతను సృష్టించి, కార్పొరేట్ల జేబులు నింపుతున్నారన్న మరో ట్వీట్ ని కూడా కేటీఆర్ రీట్వీట్ చేశారు.
ఇండియా నాట్ చేంజింగ్.. ఇండియా సెల్లింగ్..
భారత్ లో మార్పు వస్తోందని బీజేపీ ప్రచారం చేసుకుంటోందని, అయితే వాస్తవానికి భారత్ ని వారు అమ్మేస్తున్నారంటూ ఇటీవల హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో జగత్ సింగ్ నేగి అనే ఎమ్మెల్యే చేసిన విమర్శల వీడియోను ట్యాగ్ చేస్తూ కేటీఆర్ మోదీ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. గడ్డం పెంచుకున్నంత మాత్రాన రవీంద్రనాథ్ ఠాగూర్ కాలేరంటూ సదరు ఎమ్మెల్యే మోదీని తీవ్రంగా విమర్శించారు. మోదీ ప్రభుత్వం అడ్వర్టైజ్ మెంట్లకు, విదేశీ టూర్లకు ఖర్చు పెట్టిన సొమ్ము వివరాలతో సహా లెక్కచెప్పారు. అలా విమర్శించినందుకు ఆ ఎమ్మెల్యే ఇంటికి ఈడీ, ఐటీ, సీబీఐ దాడులకు సిద్ధమై ఉంటాయని చెణుకులు విసిరారు కేటీఆర్.