వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దు.. హైబ్రిడ్ మోడల్ ముద్దు..

5 పనిదినాల్లో మూడు రోజులు ఆఫీస్ నుంచి మిగతా రెండు రోజులు ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తున్నారు. దీన్ని హైబ్రిడ్ మోడల్‌గా చెబుతున్నారు. ప్రస్తుతం ఉద్యోగులు కూడా ఈ విధానాన్ని ఇష్టపడుతున్నారు.

Advertisement
Update:2022-09-28 12:35 IST

ఆఫీస్‌కి వెళ్లకుండా కేవలం ఇంట్లో కూర్చుని పనిచేసే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వల్ల మొదట్లో ఉద్యోగులు సంబరపడ్డా, ఆ తర్వాత చాలా మందికి మొహం మొత్తింది. వర్క్ ఫ్రమ్ హోమ్ బోర్ కొట్టేసింది. ప్రస్తుతం కరోనా పరిస్థితులు కూడా చక్కబడటంతో కంపెనీలు కూడా ఉద్యోగులను ఆఫీస్ లకు రావాలంటూ సందేశాలు పంపిస్తున్నాయి. అయితే మధ్యే మార్గంగా హైబ్రిడ్ మోడల్ అనేది ఇప్పుడు బాగా పాపులర్ అవుతోంది. ఐటీ, ఐటీ సంబంధిత రంగాలవారికి వారంలో ఎలాగూ రెండు రోజులు సెలవు, మిగతా 5 పనిదినాల్లో మూడు రోజులు ఆఫీస్ నుంచి మిగతా రెండు రోజులు ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తున్నారు. దీన్ని హైబ్రిడ్ మోడల్‌గా చెబుతున్నారు. ప్రస్తుతం ఉద్యోగులు కూడా ఈ విధానాన్ని ఇష్టపడుతున్నారు.

దశలవారీగా ముగింపు..

ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల్ని సడన్‌గా ఆఫీస్‌లకు రావాలని చెప్పడం సరికాదని భావిస్తున్నాయి కంపెనీలు. అలా ఆదేశాలిస్తే మొదటికే మోసం వస్తుందనే అనుమానం కూడా ఉంది. అందుకే వారికి తిరిగి ఆఫీస్‌ను అలవాటు చేసేందుకు వారంలో మూడు రోజులు మాత్రమే ఆఫీస్‌కి వచ్చి పని చేసేలా కబురందిస్తున్నాయి. దశలవారీగా ఐటీ కంపెనీలు వర్క్‌ ఫ్రం హోం విధానానికి ముగింపు పలకాలనుకుంటున్నాయి.

హైదరాబాద్‌లో ఇప్పటికే 25 శాతం మందికిపైగా ఉద్యోగులు ఆఫీస్‌లకు వచ్చి పనిచేస్తున్నారు. మిగిలిన ఉద్యోగులు కూడా అక్టోబర్‌ నుంచి కార్యాలయాలకు రావాలని కంపెనీలు ఆదేశాలివ్వడంతో చాలామంది స్వస్థలాల నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అక్టోబర్‌ నెలలో రెండు ప్రధాన పండగలు ఉండడంతో ఐటీ ఉద్యోగులు కొంత వెసులుబాటు కోరుతున్నారు. అంటే దాదాపుగా అక్టోబర్ లేదా నవంబర్ నెల నుంచి ఆఫీస్ వర్క్ జోరందుకుంటుందని అంచనా. ఆఫీస్‌లకు వచ్చి పనిచేసే ఉద్యోగుల సంఖ్య 40 శాతం వరకు పెరగవచ్చని, మిగతా ఉద్యోగులంతా మరికొంత కాలంపాటు హైబ్రిడ్‌ విధానంలో వారంలో 3 రోజులు ఆఫీసు నుంచి, 2 రోజులు ఇంటి నుంచి పనిచేసే అవకాశాలున్నాయని సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లోని కంపెనీల్లో 1200కుపైగా కంపెనీలు ఐటీ సర్వీసెస్‌, ఐటీ ప్రొడక్ట్‌, బీపీవో, జీసీసీ కేటగిరీలోకి వస్తాయి. ఐటీ ప్రొడక్ట్‌, బీపీవో కంపెనీల్లో 70 నుంచి 80 శాతం మంది ఉద్యోగులు ఆఫీసుల నుంచే పనిచేస్తున్నారు. ఐటీ సర్వీసెస్‌, జీసీసీ కంపెనీల్లో మాత్రం 10 నుంచి 15 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఆఫీస్‌లకు వస్తున్నారు. సంక్రాంతి వరకు ఇదే విధానం కొనసాగవచ్చని, వచ్చే ఏడాది మార్చి తర్వాత పూర్తి స్థాయిలో ఉద్యోగులు ఆఫీస్‌లకు రావొచ్చని అంచనా వేస్తున్నాయి యాజమాన్యాలు.

Tags:    
Advertisement

Similar News