రైతుల భయమే యూరియా డిమాండుకు కారణమా? అధికారులు ఏం చెబుతున్నారు?
చాలా మంది రైతులు ముందస్తు అవసరాల కోసం ఎక్కువగా యూరియాను కొంటున్నారని.. రైతుల భయమే యూరియా డిమాండ్ భారీగా పెరగడానికి కారణమని అంటున్నారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో యూరియాకు భారీ డిమాండ్ ఏర్పడింది. కొన్ని చోట్ల తోపులాటలు, ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం సరిపడా యూరియాను అందుబాటులో ఉంచలేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు మొదలు పెట్టాయి. ప్రభుత్వం డిమాండుకు సరిపడా యూరియాను నిజంగానే అందుబాటులో ఉంచలేదా? ప్రభుత్వం చెప్పేవన్నీ ఉత్తమాటలేనా అంటే అధికారులు కొట్టి పడేస్తున్నారు. రాష్ట్రంలో ఈ సీజన్‌కు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.
వర్షాలు పడటంతో ఒక్కసారిగా యూరియాకు డిమాండ్ పెరిగిందని. చాలా మంది రైతులు ముందస్తు అవసరాల కోసం ఎక్కువగా యూరియాను కొంటున్నారని.. రైతుల భయమే యూరియా డిమాండ్ భారీగా పెరగడానికి కారణమని అంటున్నారు. రాష్ట్రంలో వానాకాలం సీజన్‌లో రోజు వారీగా 4 నుంచి 5 టన్నుల యూరియాను విక్రయిస్తుంటారు. కానీ గత మూడు రోజులుగా రోజుకు ఏకంగా 15 వేల టన్నుల విక్రయాలు జరగడం గమనార్హం.
ఖరీఫ్ సీజన్‌లో రైతులు 16 లక్షల టన్నులకు పైగా ఎరువులను వాడుతుంటారు. ఇందులో 9 లక్షల టన్నులు యూరియా, 4 లక్షల టన్నుల కాంప్లెక్స్, 3 లక్షల టన్నుల డీపీఏ ఉంటుంది. ప్రస్తుత సీజన్ కోసం ప్రభుత్వం ముందుగానే 9.14 లక్షల టన్నుల యూరియా, 7.5 లక్షల టన్నుల డీపీఏ, కాంప్లెక్స్ ఎరువులను సిద్ధంగా ఉంచింది. యాసంగి నిల్వలతో కలిపి మొత్తం 9.93 లక్షల టన్నుల యూరియాను అందుబాటులో ఉంచింది.
రైతులకు అవసరమైన యూరియా, ఇతర ఎరువులను ఆయా కంపెనీల నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా దిగుమతి చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 908 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 16 వేలకు పైగా ఉన్నా ఆథరైజ్డ్ డీలర్ల ద్వారా రైతులకు విక్రయిస్తుంటారు. మే నెల నుంచే ఎరువుల పంపిణీ ప్రారంభం అవుతుంది. అయితే ఈ సారి సహకార సంఘాల గోడౌన్లలో ధాన్యం నిల్వలు భారీగా ఉండటంతో.. జూన్ నుంచి పంపిణీ ప్రారంభించారు.
జూన్‌లో రాష్ట్రంలో వర్షాల జాడ లేకపోవడంతో చాలా మంది రైతులు ఎరువులు కొనుగోలు చేయలేదని అధికారులు చెప్పారు. జూలై 3వ వారంలో వర్షలు పడిన తర్వాత యూరియాను కొనడం ప్రారంభించారు. జూన్ నెలాఖరు వరకు 2.5 లక్షల టన్నుల యూరియా విక్రయించబడింది. ఆగస్టులో వర్షాలు తగ్గిపోవడంతో యూరియా అమ్మకాలు కూడా తగ్గిపోయాయి. కాగా, సెప్టెంబర్ మొదటి వారం నుంచి వర్షాలు పెరగడంతో యూరియాకు డిమాండ్ పెరిగిందని అధికారులు చెబుతున్నారు.
వరుసగా వర్షాలు పడుతుండటంతో వ్యవసాయ పనులు ముమ్మరం అయ్యాయి. దీంతో పెద్ద సంఖ్యలో రైతులు సహకార సంఘాలకు తరలి వస్తున్నారు. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో రైతులు భారీగా క్యూ కడుతున్నారు. సహకార సంఘాలకు చేరుకున్న నిల్వలను ఎప్పటికప్పుడు రైతులకు పంపిణీ చేస్తున్నారు. చాలా మంది రైతులకు అందకపోవడంతో ప్రైవేటు డీలర్ల వద్దకు క్యూకడుతున్నారు. ఇలా రైతులందరూ ఒకే సారి రావడంతోనే భారీగా రద్దీ ఏర్పడిందని.. కానీ, యూరియాకు ఏ మాత్రం కొరత లేదని అధికారులు వెల్లడిస్తున్నారు. రైతుల భయమే యూరియా డిమాండుకు కారణమని అంటున్నారు.