మధు యాష్కికి సొంత పార్టీ నాయకులే సహకరించడం లేదా?

ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటంతో ఈ టికెట్ కోసం భారీగా పోటీ పడ్డారు.

Advertisement
Update:2023-11-04 20:42 IST

మధు యాష్కికి సొంత పార్టీ నాయకులే సహకరించడం లేదా?

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న నియోజకవర్గాల్లో ఎల్బీనగర్ ఒకటి. జీహెచ్ఎంసీ పరిధిలోని ఈ నియోజకవర్గం ఎన్నికల విషయంలో భిన్నమైన ఫలితమే వస్తోంది. వరుసగా ఏ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఇక్కడ గెలవలేదు. 2009లో కాంగ్రెస్ నుంచి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గెలవగా.. 2014లో టీడీపీ నుంచి ఆర్ క్రిష్ణయ్య గెలుపొందారు. ఇక 2018లో మరోసారి దేవిరెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ ఫుల్ స్వింగ్‌లో ఉన్న 2018లో కూడా ఎల్బీనగర్ ఓటర్లు కాంగ్రెస్ పార్టీనే గెలిపించారు. అయితే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి బలమైన అనుచరగణం, ఓటు బ్యాంకు ఉండటం వల్లే గెలిచారని స్థానికులు చెబుతారు.

ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటంతో ఈ టికెట్ కోసం భారీగా పోటీ పడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో గెలిచిన తర్వాత బీఆర్ఎస్‌లోకి వెళ్లడంతో.. అప్పటి నుంచి లోకల్‌లో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు లేకుండా పోయింది.అయితే జక్కడి ప్రభాకర్ రెడ్డి మాత్రం మొదటి నుంచి కాంగ్రెస్‌ను నమ్ముకొని ఉన్నారు. తనకే టికెట్ వస్తుందనే ధీమాతో నియోజకవర్గం మొత్తం పోస్టర్లు కొట్టించారు. రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' టైంలో భారీగానే ఖర్చు పెట్టారు. తనకు టికెట్ పక్కా అని జక్కిడి ఫిక్స్ అయ్యారు.

బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో అలిగిన రామ్మోహన్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరారు. తనకు కాకపోయినా తన భార్యకు టికెట్ ఇవ్వాలని కోరారు. బీసీ కోటాలో తప్పకుండా టికెట్ వస్తుందని ఆశపడ్డారు. చివరకు కాంగ్రెస్ అధిష్టానం మధు యాష్కి గౌడ్‌కు టికెట్ ఇచ్చింది. ఇది స్థానిక కాంగ్రెస్ నాయకులకు, క్యాడర్‌కు మింగుడు పడటం లేదు. స్థానికేతరుడైన మధు యాష్కికి టికెట్ ఇవ్వడంపై ఇప్పటికీ గుర్రుగానే ఉన్నారు. మరోవైపు రామ్మోహన్ గౌడ్ తిరిగి బీఆర్ఎస్‌లో చేరారు.

మధు యాష్కి స్థానికేతరుడనే కారణంతో లోకల్ కాంగ్రెస్ నాయకులు పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తున్నట్లు తెలుస్తున్నది. తాను హయత్‌నగర్‌లోనే పుట్టానని మధు యాష్కి చెప్పుకుంటున్నా.. స్థానికులు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికే మధు యాష్కికి టికెట్ కేటాయించినా.. ఇప్పటి వరకు నియోజకవర్గంలో తిరిగింది లేదు. వాస్తవానికి మధు యాష్కి శుక్రవారమే నామినేషన్ వేయాలని డిసైడ్ అయ్యారు. అయితే స్థానిక నాయకులు సహకరించకపోవడంతో వెనక్కు తగ్గినట్లు తెలుస్తున్నది.

తాను తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఢిల్లీలో లాబీయింగ్ చేశానని.. ఏనాడూ తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించలేదని మధు యాష్కి స్థానిక నేతలకు చెప్పుకుంటున్నారు. తాను గెలిస్తే కచ్చితంగా మంత్రిని అవుతానని.. అప్పుడు తప్పుకుండా అందరికీ న్యాయం చేస్తానని హమీ ఇస్తున్నారు. మధు యాష్కి ఇంత చెబుతున్నా.. ఎప్పటి నుంచో కాంగ్రెస్‌లో కొనసాగుతున్న లీడర్లు నమ్మడం లేదు. పైగా ఎల్బీనగర్‌లో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బలం ఎక్కువగా ఉండటంతో పాత కాంగ్రెస్ నాయకులు కూడా సైలెంట్ అయిపోయినట్లు తెలుస్తున్నది.

Tags:    
Advertisement

Similar News