'ఆరోగ్యశ్రీ' రద్దవుతుందన్న ప్రచారంలో నిజముందా ?

అధికారులు చెప్తున్న గణాంకాల ప్రకారం, ఆయుష్మాన్‌ భారత్ పథకం తెలంగాణలో కేవలం 26 లక్షల కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుంది. అదే ఆరోగ్యశ్రీ 90 లక్షల కుటుంబాలకు వర్తిస్తుంది. ఆయుష్మాన్‌ భారత్‌ కింద కేంద్ర ప్రభుత్వం ఒక్కో రోగికి సగటున రూ.11,924 మాత్రమే ఖర్చు చేస్తున్నది. అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కింద ఒక్కో రోగిపై సగటున రూ.46,250 ఖర్చు చేసింది.

Advertisement
Update:2023-03-25 10:47 IST

''ఆరోగ్యశ్రీ పథకం త్వరలోనే ఆగిపోతుంది. ఈపథకాన్ని ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ పథకమే అమల్లో ఉంటుంది.ఆయుష్మాన్‌ భారత్ కార్డు ఉన్నవారికే ఇకపై ఉచిత వైద్యం అందుతుంది.ఆయుష్మాన్‌ భారత్‌ దరఖాస్తుకు ఈ నెల 31వ తేదీ ఆఖరి గడువు.'' అంటూ మీకు కూడా వాట్సప్ లో మెసేజ్ వచ్చిందా ? ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వాట్సప్ గ్రూపుల్లో ఈ మెసేజ్ ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా గ్రామాల్లో వాట్సప్ యూనివర్సిటీ స్కాలర్స్ కొందరు ఈ మెసేజ్ ను పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు.

దీంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఇకపై తమకు ఉచిత వైద్యం అందాలంటే ఆయుష్మాన్‌ భారత్ తప్పని సరి కాబోలంటూ, ఆ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి పొలోమంటూ ఈ సేవా కేంద్రాల ముందు లైన్లు కడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నవారు సొంతూళ్లకు వెళ్లి మరీ హడావిడిగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇదే అవకాశంగా తీసుకొని ఈ సేవ కేంద్రాల యాజమానులు ఒక్కో దరఖాస్తుకు 30 రూపాయల నుండి 100 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు.

మరి ఈ ప్రచారంలో నిజమెంత ?

ఈ విధమైన ప్రచారం నేపథ్యంలో స్పందించిన అధికారులు ఆ మెసేజ్ ను నమ్మొద్దని, అది అబద్దపుప్రచారమని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ ఎప్పటికీ ఆగిపోదని, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని అధికారులు చెప్తున్నారు. ఆరోగ్యశ్రీ ఉన్న తర్వాత ఆయుష్మాన్‌ భారత్ తో ఎటువంటి ఉపయోగం లేదని అధికారులు అంటున్నారు. ప్రజలు తప్పుడు సమాచారం నమ్మి అనవసరంగా భయపడవద్దని, డబ్బును, సమయాన్ని వృథా చేసుకోవద్దని కోరుతున్నారు.

ఇక అధికారులు చెప్తున్న గణాంకాల ప్రకారం, ఆయుష్మాన్‌ భారత్ పథకం తెలంగాణలో కేవలం 26 లక్షల కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుంది. అదే ఆరోగ్యశ్రీ 90 లక్షల కుటుంబాలకు వర్తిస్తుంది. ఆయుష్మాన్‌ భారత్‌ కింద కేంద్ర ప్రభుత్వం ఒక్కో రోగికి సగటున రూ.11,924 మాత్రమే ఖర్చు చేస్తున్నది. అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కింద ఒక్కో రోగిపై సగటున రూ.46,250 ఖర్చు చేసింది.

మరి ఆరోగ్యశ్రీ ఆగిపోతుందనే ప్రచారం ఎవరు, ఎందుకు చేస్తున్నట్టు? దీనిలో రాజకీయ కోణముందనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం వెనక బీజేపీ ఉందని బీఆరెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

ఆరోగ్య శ్రీ కన్నా ఆయుష్మాన్‌ భారత్ పథకం గొప్పదంటూ రాష్ట్ర బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, నిర్మలా సీతారామన్ వంటి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు.

సభల్లో, మీడియా సమావేశాల్లో బీజేపీనేతలు ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్ గురించిన వ్యాఖ్యలు...ప్రస్తుతం వాట్స‌ప్ యూనివర్సిటీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని లింక్ చేసుకొని చూడాల్సిన అవసరం ఉందంటారా ?

Tags:    
Advertisement

Similar News