తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్‌.. ఆయన బ్యాగ్రౌండ్‌ తెలుసా?

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీ జితేందర్. 14 నెలల పాటు డీజీపీగా కొనసాగనున్నారు.

Advertisement
Update:2024-07-10 17:34 IST

తెలంగాణ కొత్త డీజీపీగా 1992 IPS బ్యాచ్‌కు చెందిన జితేందర్‌ను నియమించింది ప్రభుత్వం. ప్రస్తుత డీజీపీ రవి గుప్తాను హోం శాఖ స్పెషల్ చీఫ్‌ సెక్రటరీగా బదిలీ చేసింది. ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ ప్రకటన మంగళవారమే రావాల్సి ఉండగా.. సీఎం రేవంత్ మహబూబ్‌నగర్ పర్యటన కారణంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీ జితేందర్. 14 నెలల పాటు డీజీపీగా కొనసాగనున్నారు.


జితేందర్‌ పంజాబ్‌లోని జలంధర్‌లో జన్మించారు. ఏపీ కేడర్‌కు ఎంపికయ్యారు. మొదట నిర్మల్ ASPగా పనిచేశారు. తర్వాత బెల్లంపల్లి అడిషనల్‌ ఎస్పీగానూ విధులు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నక్సల్స్‌ ప్రభావిత జిల్లాలైన మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా పనిచేశారు. ఢిల్లీ సీబీఐతో పాటు 2004 - 06 మధ్య గ్రేహౌండ్స్‌లో పనిచేశారు. తర్వాత విశాఖపట్నం రేంజ్‌లో డీఐజీగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రేంజ్ డీఐజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో బాధ్యతలు నిర్వర్తించిన ఆయన హైదరాబాద్‌ కమిషనరేట్‌లో ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌గానూ పనిచేశారు.

తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్లశాఖ డీజీగా కూడా పనిచేశారు జితేందర్‌. ఇప్పటివరకూ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జితేందర్‌ 2025 సెప్టెంబరులో రిటైర్ కానున్నారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రవిగుప్తాను ఎన్నికల ఫలితాల రోజు ఎన్నికల కమిషన్ నియమించింది. అప్పట్లో డీజీపీగా ఉన్న అంజనీకుమార్‌ను క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేసి.. ఆ స్థానంలో రవిగుప్తాను ఎంపిక చేసింది. అప్పటి నుంచి ఆయనే డీజీపీగా కొనసాగారు.

Tags:    
Advertisement

Similar News