హార్వర్డ్ నుంచి కేటీఆర్ కి మళ్లీ ఆహ్వానం.. ఈ సారి టాపిక్ ఏంటంటే..?

తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడులకు రాష్ట్రం కేంద్రంగా ఎలా మారిందనే విషయాలపై హార్వర్డ్ విద్యార్థులు కేటీఆర్ సందేశాన్ని వినాలనుకుంటున్నారు. ఆయన సందేశం తమకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Update:2023-10-14 18:13 IST

ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి మంత్రి కేటీఆర్ కి మరో ఆహ్వానం అందింది. ఇండియా కాన్ఫరెన్స్ 21వ ఎడిషన్ కోసం ఈ ఆహ్వానాన్ని అందించారు హార్వర్డ్ లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు. 'ఫైర్ సైడ్ చాట్' పేరుతో చర్చాగోష్టి నిర్వహించబోతున్నారు. ఈసారి టాపిక్ 'ఇండియా రైజింగ్: బిజినెస్, ఎకానమీ, అండ్ కల్చర్'. అంటే.. వ్యాపార, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో భారత పురోభివృద్ధిపై చర్చ జరుగుతుంది. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొని సందేశం ఇవ్వాలని కోరుతూ మంత్రి కేటీఆర్ కి ఆహ్వానం అందింది.

ఫిబ్రవరిలో కాన్ఫరెన్స్..

హార్వర్డ్ ఆహ్వానం కేటీఆర్ కి ఇదే మొదటిది కాదు. గతంలో కూడా ఆయనకు ఈ ప్రఖ్యాత యూనివర్శిటీ నుంచి కాన్ఫరెన్స్ లలో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందాయి. ఇప్పుడు మరోసారి కేటీఆర్ రాకకోసం వేచి చూస్తున్నామంటూ ఇన్విటేషన్ పంపించారు హార్వర్డ్ లోని భారతీయ విద్యార్థులు. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. అంటే ఎన్నికల హడావిడి పూర్తయిపోతుంది. పూర్తి స్థాయిలో పాలనలో తలమునకలయ్యే సమయం అది. ఆ సమయంలో ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. బోస్టన్ లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ క్యాంపస్ లో 18వతేదీ జరిగే కాన్ఫరెన్స్ లో కేటీఆర్ పాల్గొనాల్సి ఉంది.

తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడులకు రాష్ట్రం కేంద్రంగా ఎలా మారిందనే విషయాలపై హార్వర్డ్ విద్యార్థులు కేటీఆర్ సందేశాన్ని వినాలనుకుంటున్నారు. ఆయన సందేశం తమకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి నమూనా, అన్నిరంగాల్లో జరుగుతున్న సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి గురించి తెలుసుకోవాలనుకుంటున్నట్టు తమ ఆహ్వానంలో వారు తెలిపారు. అజీమ్ ప్రేమ్ జీ, అమర్త్యసేన్ వంటి వారికి కూడా హార్వర్డ్ నుంచి ఆహ్వానాలందాయి. ప్రపంచ వ్యాప్తంగా వెయ్యిమందికి పైగా వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖులు ఈ కాన్ఫరెన్స్ కి హాజరవుతారు. 

Tags:    
Advertisement

Similar News