మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈసారి క్లాస్ రూమ్ లోనే ఉరి

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ స్టూడెంట్ సాత్విక్‌, క్లాస్‌ రూమ్‌ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం రాత్రి క్లాస్‌ రూమ్‌ లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Advertisement
Update:2023-03-01 08:06 IST

మెడికో ప్రీతి ఆత్మహత్య ఘటన మరవకముందే.. వరంగల్ లో బీటెక్ విద్యార్థిని రక్షిత ఉరేసుకుని చనిపోవడం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఇప్పుడు మరో ఉరి కలకలం రేపింది. ఈసారి నేరుగా క్లాస్ రూమ్ లోనే ఇంటర్ విద్యార్థి ఉరివేసుకుని చనిపోవడం సంచలనంగా మారింది. నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీలో ఈ విషాదం జరిగింది.

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ స్టూడెంట్ సాత్విక్‌, క్లాస్‌ రూమ్‌ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం రాత్రి క్లాస్‌ రూమ్‌ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా అది గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించేలోపే సాత్విక్‌ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సాత్విక్ ని ఆస్పత్రికి తరలించే క్రమంలో కాలేజీ సిబ్బందిని సాయం కోరినా వారు పట్టించుకోలేదని సహ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బయట వాహనం లిఫ్ట్‌ అడిగి ఆసుపత్రికి తరలించామని అప్పటికే ఆలస్యం అయిందని చెబుతున్నారు.

చదువుల ఒత్తిడే కారణమా..?

సాత్విక్ కాలేజీలో ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా లెక్చరర్స్‌ సాత్విక్ ని కొట్టేవారని, ఓ సందర్భంలో లెక్చరర్ల దెబ్బలతో సాత్విక్ 15 రోజులు ఆసుపత్రి పాలయ్యాడని అంటున్నారు పేరెంట్స్. తమ పిల్లవాడిని ఏమీ అనొద్దని గతంలోనే చెప్పామని, మానసిక ఒత్తిడికి గురిచేయొద్దని కోరినట్టు తెలిపారు. కానీ కాలేజీ సిబ్బంది దాష్టీకం వల్లే సాత్విక్‌ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. కాలేజీ యాజమాన్యమే ఈ ఆత్మహత్యకు బాధ్యత వహించాలన్నారు.

Tags:    
Advertisement

Similar News