సీఎం, మంత్రుల ఇలాఖాలోనే ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌

ఈనెల 11న శంకుస్థాపన చేయనున్న సీఎం, మంత్రులు

Advertisement
Update:2024-10-06 13:52 IST

సీఎం రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లోనే మొదటి దశలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మించనున్నారు. ఈనెల 11న ఈ స్కూల్స్‌ నిర్మాణానికి సీఎం, మంత్రులు, ప్రభుత్వంలోని ముఖ్యులు శంకుస్థాపన చేయనున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌, కాంప్లెక్స్‌ లపై ఆదివారం సెక్రటేరియట్‌ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీఎస్‌ శాంతి కుమారి, అధికారులతో రివ్యూ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈనెల 11న కొడంగల్, మధిర, మంథని, హుస్నాబాద్, నల్గొండ, హుజూర్‌ నగర్, ములుగు, ఖమ్మం, కొల్లాపూర్, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, అచ్చంపేట, తిరుమలగిరి (తుంగతుర్తి), పాలేరు, వరంగల్, ఆంథోల్, భూపాలపల్లి, స్టేషన్ ఘన్‌ పూర్‌ లో రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు.

ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు నిర్మించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్కూళ్లు నిర్మిస్తామని తెలిపారు. దేశానికే ఆదర్శంగా వాటిని తీర్చిదిద్దుతామన్నారు. గురుకులాలు, రెసిడెన్షియల్‌ స్కూళ్లకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని, త్వరగా పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశంచారని అన్నారు. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున రెసిడెన్షియల్‌ స్కూళ్లను ప్రారంభించామని ప్రచారం చేసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో 1,023 రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఉంటే 600 పైగా స్కూళ్లకు సొంత భవనాలు లేవన్నారు. ఈ ఏడాది రెసిడెన్షియల్‌ స్కూళ్లు, గురుకులాల భవన నిర్మాణాలు, ఇతర పనుల కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి గురుకులాల్లో వసతుల కల్పనకు చిత్తశుద్ధి లేదని, వాటిని బాగు చేయాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు.




 

సీఎం రేవంత్‌ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తోన్న కొడంగల్‌ తో పాటు ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లి ఉన్న నియోజకవర్గం అచ్చంపేట కు ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ మంజూరు చేశారు. ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్‌ ఓవైసీ ప్రాతినిథ్యం వహిస్తోన్న చాంద్రాయణగుట్టకు స్కూల్‌ మంజూరు చేశారు. తద్వారా ఆ పార్టీ ముఖ్యులను సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం మొదటి దశలో 18 స్కూళ్లకు శంకుస్థాపన చేస్తుండగా వాటిలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎన్నికైన ఒక్క నియోజకవర్గానికి స్కూల్‌ మంజూరు చేయలేదు. ఎంఐఎంతో దోస్తీ కోసమే ఒక్క చాంద్రాయణగుట్టకు స్కూల్‌ మంజూరు చేశారు. ఓల్డ్‌ సిటీలో ఈ ఒక్క నియోజకవర్గానికే మొదటి దశలో చోటు దక్కింది. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే వరంగల్‌ కు నాలుగు, నల్గొండ, మహబూబ్‌ నగర్‌, ఖమ్మం జిల్లాలకు మూడు చొప్పున, కరీంనగర్ కు రెండు, ఆదిలాబాద్‌, మెదక్‌, హైదరాబాద్‌ జిల్లాలకు ఒక్కో స్కూల్‌ మంజూరు చేశారు. రంగారెడ్డి జిల్లాకు ఒక్క స్కూల్‌ దక్కలేదు. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో స్టేషన్‌ ఘన్‌ పూర్‌ కు ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ శాంక్షన్‌ చేశారు.

Tags:    
Advertisement

Similar News