ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లా.. కోళ్ల ఫామ్‌ లా?

బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్ కుమార్‌

Advertisement
Update:2024-10-08 17:03 IST

ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లా లేక కోళ్ల ఫామ్‌ లా.. ఒకే స్కూల్‌ లో 2,560 మందిని ఎలా కుక్కుతారని బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ ప్రశ్నించారు. గత పదేళ్లలో తెలంగాణ విద్యా వ్యవస్థ శిథిలమయ్యిందని సీఎం, డిప్యూటీ సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ ఎంతో శ్రమించి గురుకుల వ్యవస్థను తీసుకువచ్చారని, డిప్యూటీ సీఎం భట్టి అవగాహన లేకుండా గురుకులాలపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం, డిప్యూటీ సీఎం ఎప్పుడైనా గురుకులాలకు వెళ్లారా అని ప్రశ్నించారు. అన్ని గురుకులాల్లో అన్ని సామాజికవర్గాల వాళ్లు చదువుతున్నారని తెలిపారు. ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలను బంద్‌ చేస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.లక్ష ఖర్చు చేశారని తెలిపారు. ప్రభుత్వం 10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ తో ఆడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 662 గురుకులాలకు ప్రభుత్వం వెంటనే బడ్జెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. భట్టి సెంట్రల్‌ యూనివర్సిటీలో చదువుకున్నారని, అక్కడ అందరికీ ఒకే డైనింగ్‌ హాల్‌, ఒకే హాస్టల్‌ ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఒక్కో గురుకులానికి పదెకరాల స్థలం కేటాయించారని, 2,560 మంది చదివే ఇంటిగ్రేటెడ్‌ స్కూల్ భవనాలకు 25 ఎకరాలు, రూ.25 కోట్లు ఎలా సరిపోతాయో చెప్పాలన్నారు. రాష్ట్రంలో అన్ని సంక్షేమ శాఖలను రద్దు చేయాలనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ కు సంబంధించిన జీవోనే లేకుండా భట్టి ఎలా పవర్ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారని ప్రశ్నించారు. గురుకులాలను మూసి వేయడానికి రేవంత్‌ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఈక్రమంలోనే ఒకే రోజు 2 వేల మంది టీచర్లను తొలగించారని, ఉన్న స్టాఫ్‌ కు సరిగా జీతాలు ఇవ్వడం లేదన్నారు. ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రేవంత్‌ ప్రయత్నిస్తున్నారని, అవి ఫలవంతం కావన్నారు. ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ పై అఖిలపక్షం నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

Tags:    
Advertisement

Similar News